రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రాణి అయిన ‘క్వీన్ ఎలిజబెత్-II’ మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రాజు అయిన కింగ్ చార్లెస్ III తన తల్లి మరణంపై స్పందిస్తూ ‘క్వీన్ ఎలిజబెట్ III మరణం తనకు, తన కుటుంబాన్ని తీరని బాధలో ముంచేసింది.’ అని తెలిపారు. దేశంలోని ప్రజలకు, కామన్వెల్త్ దేశాలకు, ప్రపంచంలోని ఎంతో మందికి తన మరణం తీరని లోటు అని తెలిపారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘క్వీన్ ఎలిజబెత్-II’ మరణంపై స్పందించారు. ‘2015, 2018లో నేను క్వీన్ ఎలిజబెత్-IIతో గుర్తుంచుకోదగ్గ సమావేశాల్లో పాల్గొన్నాను. తన మంచి తనాన్ని, దయా గుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మహాత్మా గాంధీ తన పెళ్లికి కానుకగా ఇచ్చిన చేతి రుమాలును కూడా ఆవిడ నాకు చూపించారు.’ అని మోదీ ట్వీట్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, తన భార్య హిల్లరీ క్లింటన్ కూడా క్వీన్ మరణంపై స్పందించారు. ‘క్వీన్ ఎలిజబెత్-II 70 సంవత్సరాల పాలన గుర్తుంచుకోదగ్గది.’ అని వారు తెలిపారు. ‘హిల్లరీ క్లింటన్, నేను (బిల్ క్లింటన్) క్వీన్ ఎలిజబెత్-II మరణానికి ఎంతో బాధ పడుతున్నాం. తన అద్భుతమైన జీవితానికి మేం థ్యాంక్స్ తెలుపుతున్నాం.’ అని బిల్ క్లింటన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
‘మాపై క్వీన్ ఎలిజబెత్-II చూపించిన ప్రేమను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ప్రత్యేకించి 1995, 2000 సంవత్సరాల్లో బకింగ్‌హాం ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు ఆవిడ మాపై చూపించిన అభిమానం మా మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచింది.’ అని కూడా తెలిపారు.