Hyderabad Liquor Shops : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గణేశ్ నిమజ్జనం కారణంగా మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు నిర్వహకులను ఆదేశించారు. దీంతో మద్యం ప్రియులు షాపుల వద్ద క్యూకట్టారు.
ముందు జాగ్రత్త చర్యలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుస్సేన్‌సాగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 వేల మంది పోలీస్ బలగాలను మోహరించామన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి గణేశ్ నిమజ్జనాన్ని, శోభయాత్రను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించనున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద 22 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. విగ్రహాల వ్యర్థాల వెలికితీత కోసం 20 జేసీబీలను కూడా సిద్ధం చేశారు.
విద్యాసంస్థలకు సెలవు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవుగా ప్రకటించింది. హైదరాబాద్ & సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటించింది. రేపటి సెలవుకు బదులుగా నవంబరు 12న వర్కింగ్ డే అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది.
Also Read : Hyderabad Traffic Diversion : రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్పెషల్ సర్వీసులు
Also Read : Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం, చెరువులను తలపిస్తున్న రోడ్లు