పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిపై పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిని వచ్చే వారం ప్రకటిస్తామని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. కానీ ఇంతలోనే ఆ పని ప్రజలదేనని చెప్పారు.
కాంగ్రెస్ కూడా..
మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదే బాటలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత సీఎంగా ఎవరు ఉండాలనేది పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సీఎంను ఎంపిక చేయడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అన్నారు. పార్టీ (కాంగ్రెస్) హైకమాండ్ సీఎంను ఎంపిక చేస్తుందని మీకు ఎవరు చెప్పారని మీడియాను ప్రశ్నించారు సిద్ధూ.
సర్వేలో ఆప్..
117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అత్యధికంగా 52-58 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు ఏబీపీ-సీఓటర్ తాజా సర్వేలో తేలింది. కానీ ఇది మెజారిటీ మార్కుగా ఉన్న 59 కంటే తక్కువే. తర్వాత 37-43 సీట్లు గెలుపొంది కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు శిరోమణి అకాలీ దళ్ నేతృత్వంలోని కూటమి కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉంది. ఈ కూటమి 17-23 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు తాజా ఒపీనియన్ పోల్‌లో తేలింది. భాజపా 1-3 సీట్లు గెలుపొందే అవకాశం ఉంది.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!