Porsche Car Crash Case: పుణే పోర్షే కేసులో నిందితుడు తాను మద్యం సేవించే కార్ నడిపినట్టు అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడించాడు. ఆ సమయంలో ఏం జరిగిందో సరిగ్గా గుర్తు లేదని చెప్పాడు. ఇప్పటికే మైనర్ తల్లినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బ్లడ్ శాంపిల్‌ని తారుమారు చేసిన కేసులో ఆమెని అరెస్ట్ చేశారు. తల్లి సమక్షంలోనే నిందితుడుని ప్రశ్నించగా..మద్యం మత్తులోనే పోర్షే కార్‌ని నడిపినట్టు ఒప్పుకున్నాడు. దాదాపు గంట పాటు రకరకాల ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ అంతకు మించి నిందితుడు ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. ఇక ఈ మైనర్ తల్లిదండ్రులని జూన్ 5 వరకూ రిమాండ్‌లో ఉంచాలని పుణే కోర్టు స్పష్టం చేసింది.


ఆధారాల్ని మాయం చేసేందుకు ప్రయత్నించడాన్ని నేరంగా పరిగణించింది. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించేందుకు ఏమేం చేశారో చెప్పాలనీ అడిగారు. మెడికల్ టెస్ట్‌లపైనా అనుమానం వ్యక్తం చేశారు. కానీ...నిందితుడు మాత్రం వేటికీ నోరు మెదపలేదు. ఆ సమయంలో తనకు ఏం జరిగిందో గుర్తు రావడం లేదని మాత్రమే సమాధానమిచ్చినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదం జరగక ముందు ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వెళ్లిన నిందితుడు రూ.48 వేల బిల్‌ చేశాడు. ఇది కూడా ఈ కేసులో కీలకంగా మారింది. ఇప్పటికే మైనర్ తల్లి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. కొడుకు బ్లడ్ శాంపిల్ బదులుగా తన బ్లడ్ శాంపిల్ ఇవ్వాలని కొందరు వైద్యులు సలహా ఇచ్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. అంతకు ముందు నిందితుడి తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.


ప్రమాదం జరిగిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఆ తరవాత తాతనీ అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో కార్ నడిపింది మైనర్ కాదని, తానే అని విచారణలో చెప్పాలని డ్రైవర్‌ని బలవంత పెట్టాడు నిందితుడి తాత. అంతే కాదు. ఇంట్లో బంధించాడు. ఈ విషయం తెలిసి డ్రైవర్ భార్య ఇంటికి వెళ్లి విడిపించుకుని వచ్చింది. డ్రైవర్‌ని కిడ్నాప్ చేసి ఒత్తిడి చేసిన కేసులో తాతని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ కీలక విషయం ఏంటంటే..నిందితుడి తాతకి చోటా రాజన్ గ్యాంగ్‌కి లింక్స్ ఉన్నాయి. ఓ సెటిల్‌మెంట్ కేసులో ఆ గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చినట్టు తేలింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. మనవడిని తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు తానూ అరెస్ట్ అయ్యాడు. మే 19న జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు మైనర్‌ని పట్టుకుని చితకబాదారు. ఆ తరవాత పోలీసులకు అప్పగించారు. అయితే...ఈ ప్రోటోకాల్ పాటించడంలోనూ పోలీసులు కొందరు నిందితుడికే సహకరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 


Also Read: Exit Polls 2024: రాసి పెట్టుకోండి, మోదీ మళ్లీ ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటా - ఆప్ నేత సంచలన ట్వీట్