Raveena Tandon Faces Alegations Of Assault: బాలీవుడ్ నటి రవీనా టాండన్ పై కొంత మంది వ్యక్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. రవీనా ప్రయాణిస్తున్న కారు కారు ఓ మహిళను ఢీ కొట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. సదరు మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు రవీనా కారు డ్రైవర్ తో పాటు ఆమె పైనా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ముంబైలో సంచలనంగా మారింది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్టర్ రోడ్డులో జరిగింది. రిజ్వీ కాలేజీ సమీపంలో అర్థరాత్రి వేళ ఈ గొడవ అయ్యింది. నటి రవీనా టాండన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణం చేస్తుండగా, పక్కనే వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురు కారులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఆ కారులో ఉన్న వాళ్లు కోపంతో రవీనా కారును ఆపి, ఆమె డ్రైవర్ మీద మూకుమ్మడిగా దాడి చేశారు. అతడిని కొట్టకుండా అడ్డుకునేందుకు రవీనా ప్రయత్నించింది.


దయచేసి కొట్టకండి- రవీనా


తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో రవీనా ‘దయచేసి ఎవరినీ కొట్టవద్దు‘ అని వేడుకున్నా సదరు వ్యక్తులు వినిపించుకోలేదు. “గాయపడిన మహిళకు ర్తక్తం వస్తుందని నాకు తెలుసు. నా డ్రైవర్‌ను కొట్టకండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయ చేసి దాడి చేయకండి” అని రవీనా వారిని కోరింది. అయినా, వాళ్లు వినిపించుకోకుండా డ్రైవర్ మీద దాడి చేశారు. “ మీ డ్రైవర్ నన్ను కొట్టాడు. నా ముక్కు నుంచి రక్తం వస్తుంది. మీ డ్రైవర్ పారిపోయాడు. అతడిని ఇక్కడికి తీసుకు రండి” అంటూ ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి గట్టిగా అరవడం వినిపిస్తుంది.






విచారణ మొదలుపెట్టిన పోలీసులు


నటి రవీనా టాండన్ తో పాటు ఆమె డ్రైవర్ తమపై అకారణంగా దాడి చేశారని బాంద్రా నివాసి మహ్మద్ చెప్పారు. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం లేదని వెల్లడించారు. మద్యం మత్తులో రవీనా తమ కుటుంబ సభ్యులను దుర్భాషలాడిందన్నారు. వెంటనే ఆమెతో పాటు ఆమె డ్రైవర్ పై కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దాడికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాంద్రా పోలీసులు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు వెల్లడి అవుతాయని వెల్లడించారు. మహ్మద్ నుంచి ఫిర్యాదు తీసుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.   


Read Also: పెళ్లి చేసుకోవాలనుకున్నా- చిరవకు ఆ ఆలోచననే చంపేసుకున్నా: నటి కాంచన