Paruvu Web Series Trailer Out Now: ఈరోజుల్లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మేకర్స్.. డిఫరెంట్‌గా ఆలోచిస్తూ క్రియేటివ్ ఆలోచనలతో ముందుకొస్తున్నారు. అదే విధంగా తాజాగా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో గొడవపడినట్టుగా వీడియో వైరల్ అయ్యింది. ఫైనల్‌గా అది ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించింది అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వైరల్ అయిన వీడియో వల్ల ‘పరువు’ సిరీస్‌కు ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ జీ5 ఒరిజినల్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ మొత్తం పారిపోయిన ప్రేమ జంటగా కనిపించే నరేశ్ అగస్త్య, నివేదా పేతురాజ్ చుట్టూనే తిరుగుతుంది.


పారిపోయి పెళ్లి..


‘‘ఎవరూ లేని టైమ్ చూసుకొని మన జాహ్నవిని పట్టుకుపోయాడు ఆ విక్రమ్ గాడు’’ అంటూ నాగబాబు వాయిస్ ఓవర్‌తో ‘పరువు’ మూవీ ట్రైలర్ మొదలవుతుంది. ‘‘అయినా పారిపోయి పెళ్లి చేసుకోవడమేంటే’’ అనే మరో డైలాగ్‌తో అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అర్థమవుతుంది. హీరో హీరోయిన్ల పాత్రలు అయిన జాహ్నవి, విక్రమ్... ఇద్దరూ ప్రేమించుకుంటారు. కులాలు వేరు అవ్వడంతో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అని ‘పరువు’ ట్రైలర్ మొదలయిన కాసేపట్లోనే ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు దర్శకులు సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్.


ప్రేమికులే హంతకులు..


‘‘ఏదైనా కానీ నీతో లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది’’ అనే డైలాగ్‌తో నరేశ్ అగస్త్యకు ప్రపోజ్ చేస్తుంది నివేదా పేతురాజ్. ‘‘మీ అమ్మాయి విషయం నేను చూసుకుంటాను’’ అంటూ హీరోయిన్ ఫ్యామిలీకి మాటిస్తారు నాగబాబు. నివేదా, నరేశ్ కలిసి పారిపోతున్న క్రమంలో ‘‘లోపలే కూర్చోవచ్చుగా నువ్వు ప్రెగ్నెంట్‌వి’’ అంటూ నరేశ్ చెప్పే డైలాగ్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అవుతుంది. వీరిద్దరినీ చంపడానికి ఒకడు వచ్చాడని.. వాడిని చూసి హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. దీంతో వేరే దారిలేక ఆ వ్యక్తిని హత్య చేస్తాడు హీరో. దీంతో కథ మరో మలుపు తిరుగుతుందని ‘పరువు’ ట్రైలర్‌లో చూపించారు.



అదిరిపోయే గెస్ట్ రోల్..


ప్రేమికులుగా ఇంట్లో నుండి పారిపోయిన వచ్చినవారు అనుకోకుండా చేసిన హత్య వల్ల హంతకులు అవుతారు. ‘‘మనకు ఉన్న ఆప్షన్స్ రెండే. దొరికిపోవాలి లేదా పారిపోవాలి’’ అని నివేదాకు ధైర్యం చెప్తాడు నరేశ్. ట్రైలర్‌ను బట్టి చూస్తే వీరిద్దరూ పారిపోవాలి అనే దారినే ఎంచుకున్నట్టు అర్థమవుతుంది. ఫైనల్‌గా బిందు మాధవి గెస్ట్ రోల్‌తో ‘పరువు’ ట్రైలర్ ముగుస్తుంది. ఈ ట్రైలర్‌లో పలుచోట్ల కులానికి సంబంధించిన డైలాగులు కూడా జతచేశారు మేకర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ మొత్తం పరువు హత్యలకు సంబంధించిందని ముందే స్పష్టం చేశారు మేకర్స్. ఎమ్మెల్యే రామయ్యగా నాగబాబు పాత్ర ఇందులో చాలా కీలకం అని అర్థమవుతోంది. అసలు పూర్తిగా ఈ ‘పరువు’ కథ ఏంటో తెలియాంటే జూన్ 14న జీ5లో స్ట్రీమ్ అయ్యే సిరీస్‌ను చూసి తెలుసుకోవాలని మేకర్స్ చెప్తున్నారు.



Also Read: ‘టెన్నిస్ బాల్’కే అంటూ నెటిజన్ వెకిలి కామెంట్ - ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్, ‘సారీ’ చెప్పి సైలెంట్ అయ్యాడుగా!