Watch Video:
అర్ధరాత్రి కూల్చివేత..
మహారాష్ట్రలోని పుణెలో 90ల కాలం నాటి బ్రిడ్జ్‌ను కూల్చివేశారు. చాందినీ చౌక్‌లో ఈ వంతెనను బాంబులు వినియోగించి పడగొట్టారు. ముంబయి-బెంగళూరు జాతీయ రహదారి (NH4)లో ఉందీ వంతెన. అర్ధరాత్రి 1గంటకు ఈ కూల్చివేత చేపట్టారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు, అక్కడ వాహనాల రద్దీ తగ్గించేందుకు చాందినీ చౌక్ చౌరస్తాను విస్తరించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే...ఈ బ్రిడ్జ్‌ను పడగొట్టారు. ఈ వంతెన స్థానంలో కొత్తగా మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇన్నేళ్ల నుంచి ఉన్న వంతెనను కూల్చివేసే సమయంలో స్థానికులంతా వచ్చి ఆసక్తిగా చూశారు. శిథిలాలను తొలగించేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది. ఇందుకోసం ట్రక్‌లు, ఎర్త్‌మూవర్ మెషీన్లను వినియోగించారు. బ్లాస్ట్‌కు ముందు వాహనాలను ఆ దారిలోకి రాకుండా నిలిపివేశారు. వేరే దారిలో వాటిని మళ్లించారు. ఎక్కువ మంది బ్రిడ్జ్ వద్ద గుమిగూడకుండా...సెక్షన్ 144 అమలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఎడిఫిస్ ఇంజనీరింగ్ సిబ్బంది...ఈ కూల్చివేత పనిని చేపట్టింది. ఇదే కంపెనీ గతంలో నోయిడాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చివేసింది.
600 కిలోల ఎక్స్‌ప్లోజివ్స్..
"బ్రిడ్జ్‌ను రాత్రి 1 గంటకు కూల్చివేశాం. అనుకున్న ప్లాన్ విధంగానే బ్లాస్ట్ చేయగలిగాం. ప్రస్తుతానికి ఎర్త్‌మూవర్ మెషీన్లు, ఫోర్క్‌నెయిల్స్, ట్రక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం. శిథిలాల్ని తొలగిస్తున్నాం" అని ఎడిఫిస్ ఇంజనీరింగ్ కో ఓనర్ చిరాగ్ చెడా వివరించారు. ఇందుకోసం 600 కిలోల ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. ఈ బ్రిడ్జ్‌ను కూల్చివేసే ముందు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ పనులను ఏరియల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఈ కూల్చివేత పూర్తైన వెంటనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
గతంలో నోయిడా టవర్స్ కూల్చివేత..
ఆగస్టు 28న నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేశారు. అనుకున్న విధంగానే సరిగ్గా 9 సెకన్లలో ఈ టవర్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న బిల్డింగ్‌లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిపై దుమ్ము, ధూళి పడకుండా పూర్తిగా క్లాత్‌లతో కప్పేశారు. ఈ రెండు టవర్స్‌ని కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల బరువైన ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. ఈ టవర్స్‌లోని 7000 హోల్స్‌లో ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చారు. 20 వేల సర్క్యూట్‌లు ఏర్పాటు చేశారు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లర్స్ నిలువునా కూలిపోతాయి. దీన్నే "వాటర్ ఫాల్ టెక్నిక్" (Waterfall technique) అంటారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ కూల్చివేత 9 సెకన్లలో పూర్తైంది. ఇది కూలిపోయిన తరవాత వచ్చే దుమ్ము అంతా తేలిపోవటానికి కనీసం 12 నిముషాలు పడుతుంది. ఒకవేళ గాలి బాగా వీస్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుండొచ్చని అధికారులు వివరించారు. దాదాపు 55 వేల టన్నుల మేర శిథిలాలు పోగవుతాయని అంచనా. వీటిని క్లియర్ చేయటానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ శిథిలాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే డంప్ చేయనున్నారు. ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టనుంది.