PM Modi On UP Accident: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని, వారి కుటుంబసభ్యులకు PMNRF నుంచి రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. స్థానిక అధికారులు బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.


యూపీలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది వరకు మృతి చెందారు. మరో 10 మందికి గాయపడ్డారు, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాన్పుర్​లోని ఘతంపుర్​ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.






యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి..
కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్సీ సహా ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అధికంగా జరగడం చాలా బాధాకరం అన్నారు. 





మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం యోగి. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబాలకు ఈ నష్టం తీరని లోటు అన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు మంత్రులు రాకేష్‌ సచన్‌, అజిత్‌పాల్‌ను ప్రమాద స్థలానికి పంపారు ఆదిత్యనాథ్‌.  ట్రాక్టర్ - ట్రాలీలను వ్యవసాయం, వస్తువులు, పంట ఉత్పత్తుల తరలింపునకు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.