Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళనకారులు శాంతించడం లేదు. కొత్త ప్రభుత్వానికి ఇదే సవాల్‌గా మారింది. ఇంకా పలు చోట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. మొన్న పార్లమెంట్‌పై దాడి చేసిన ఆందోళనకారులు ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్‌ చేశారు. చీఫ్ జస్టిస్‌తో పాటు జడ్జ్‌లందరూ రాజీనామా చేయాలని నినదించారు. వందలాది మంది సుప్రీంకోర్టుని చుట్టుముట్టారు. తక్షణమే చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలు చూసి చీఫ్ జస్టిస్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే...కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి కనీస సమాచారం అందించకుండానే కోర్టులో మీటింగ్‌ ఏర్పాటు చేశారు. దీనిపై ఆందోళనకారులు భగ్గుమన్నారు. సుప్రీంకోర్టు జడ్జ్‌లు కూడా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు జరిగిన వెంటనే ఫుల్‌ కోర్ట్ మీటింగ్‌ని రద్దు చేశారు. 


చీఫ్ జస్టిస్‌కి ఓ గంట సమయం ఇచ్చిన ఆదందోళనకారులు ఆ లోగా రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికల మేరకు చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు స్థానిక మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఒబైదుల్ హసన్ గతేడాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్నికయ్యారు. షేక్ హసీనాకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు ఆందోళనకారులు. 


ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ స్థాయిలో అక్కడ నిరనసలు జరగడం కలకలం రేపుతోంది. దాదాపు నెల రోజులుగా బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్‌ కోటా విషయంలో తలెత్తిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకూ ఈ ఘర్షణల కారణంగా 450 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న షేక్ హసీనా తరవాత ఎక్కడికి వెళ్తారన్నతే అంతు పట్టకుండా ఉంది. భారత్ మాత్రం ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే..షేక్ హసీనా కొడుకు సాజీబ్ మాత్రం మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతామని, అక్కడ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని సంచలన ప్రకటన చేశారు. అటు బంగ్లాదేశ్‌లో మాత్రం జమాతే ఇస్లామీ పార్టీ బలం పుంజుకుంటోంది.