President Of India Draupathi Murmu Hyderabad Tour: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం వచ్చే ఆమె ఐదు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. దీని కోసం అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 


రాష్ట్రపతి ఈ సాయంత్రం నాలుగు గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యే విమానంలో దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, గవవర్నర్‌ తమిళిసై, తెలంగాణ మంత్రిమండలి ఘన స్వాగతం పలకనున్నారు. స్వాగత కార్యక్రమంలో సీఎస్‌, డీజీపీ, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. 


దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి ముర్ము బస చేసే బొల్లారం చేరుకుంటారు. అక్కడ ఐదు రోజుల పాటు ఉంటారు. ఈ ఐదు రోజుల పాటు తెలంగాణలోని వివిధ ఫేమస్‌ ప్రాంతాలను ఆమె సందర్శిస్తారు. వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారు. సామాన్యులతో కూడా ముర్ము కలిసే అవకాశం ఉంది. బుధవారం ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తారు. 


రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐదు రోజుల పాటు వివిధ జంక్షన్‌లు మూసివేయనున్నారు. హకీంపేట్‌ ఎయిర్‌పోర్స్‌ స్టేషన్ జంక్షన్, బొల్లారం చెక్‌పోస్టు, నేవీ జంక్షన్‌, యాప్రాలో రోడ్డు, హెలిప్యాట్ వై జంక్షన్, బైసన్ గేట్‌, లోతుకుంట టీ జంక్షన్ మూసివేస్తున్నట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వీటికి ప్రత్యామ్నాయ రూట్‌లలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.