భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే అధ్యక్షుడు బైడెన్‌కు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ప్రధాని మోదీ బైడెన్‌తో ఈ విషయంపై మాట్లాడారని గార్సెట్టీ తెలిపారు. ఒకవేళ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని బైడెన్‌ అంగీకరించి రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తే మన దేశంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. గతంలో 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన దేశంలో ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.


యునైటెడ్‌ స్టేట్స్‌, భారత్‌ కలిసి మన దేశంలో పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను విస్తరింప చేసేందుకు సులభతరమైన ఒక యంత్రాంగాన్ని ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం పీఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌కు ఊతమిచ్చేందుకు అమెరికా సహాయపడనుంది. తగినంత ప్రజా రవాణా లేని నగరాల కోసం పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయడం ఈ పథకం లక్ష్యం. అమెరికా రాయబారి గార్సెట్టి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ప్రతి రోజూ మనం ప్రపంచ స్థాయిలో వాతావరణ సంక్షోభం ప్రభావాన్ని చూస్తున్నాం. మనం ఇప్పుడే స్పందించాలి లేదంటే మన గ్రహం, ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ రోజు ప్రకటిస్తున్న అమెరికా, భారత్‌ భాగస్వామ్యం దేశం అంతటా 10,000 ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చేందుకు ఫైనాన్సింగ్‌ను సమీకరిస్తుంది. భారత దేశంలో ఎలక్ట్రిక్‌ ప్రజా రవాణాను విస్తరిస్తుంది. పరిశుభ్రమైన నగరాలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది'   అని తెలిపారు. ఈ ప్రాజెక్టు మేజర్‌ కాంపొనెంట్ నూతన పేమెంట్‌ సెక్యురిటీ మెకానిజమ్‌(పీఎస్‌ఎం) అని ఆయన వెల్లడించారు. దీని ద్వారా మెరుగైన రుణ నిబంధనలను మెరుగుపరుస్తుంది, ఫైనాన్సింగ్‌ ఖర్చులను తగ్గిస్తుంది, ప్రాజెక్టు అమలును సులభతరం చేస్తుందని అన్నారు.


భారత్‌-కెనడా దౌత్య పరమైన వివాదంపైనా గార్సెట్టి స్పందించారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయాలని, ఇతర  అనుమానాలు రాకముందే సరైన విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. కెనడా తమకు పొరుగున ఉన్న మంచి మిత్ర దేశమని, భారత్‌ పట్ల తాము ఎలాగైతే శ్రద్ధ వహిస్తామో, కెనడా పట్ల కూడా అలాగే శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు తమ దేశాల మధ్య సంబంధాలను నిర్వచించలేవని భావిస్తున్నానని, దాని వల్ల పురోగతి నెమ్మదిస్తుందని అన్నారు. సరైన విధంగా విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావాలని పేర్కొన్నారు.


వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్‌ డే సమయంలోనే క్వాడ్‌ సదస్సు జరగనుందా అని విలేకరులు గార్సెట్టిని ప్రశ్నించగా తనకు ఆ సమాచారం తెలియదని ఆయన బదులిచ్చారు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ సదస్సుకు వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ దేశాల అధినేతలు భారత్‌ వచ్చే అవకాశం ఉంది.