Indias first Vande Metro rail |  గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. భుజ్‌లో ఈ వందే మెట్రో రైల్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లోని భుజ్‌ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ వరకు ఈ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. వందే మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా పేరు మార్చుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసుగా ఇది రికార్డులకెక్కింది. దేశంలో ఇప్పటికే వందే భారత్‌, అమృత్‌ భారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు వందే మెట్రో రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ వందే మెట్రో రైలులో రిజర్వేషన్ సౌకర్యం లేదు. పూర్తి అన్‌ రిజర్వ్‌డ్‌ అండ్ ఎయిర్ కండిషన్డ్‌ రైలు.


ఈ రైలు అహ్మదాబాద్‌- భుజ్‌ మధ్య 360 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టనుంది. ఈ మధ్యలో 9 స్టాపులు ఉండగా.. మొత్తం ప్రయాణ సమయం 5 గంటలా 45 నిమిషాలుగా అధికారులు తెలిపారు. ఈ వందే మెట్రోలో 11 వందల 50 మంది కూర్చొని..  మరో 2 వేల 50 మందికి పైగా నిలుచుని ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ వందే మెట్రో గరిష్ఠంగా 110 కీలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. రోజూ ఉదయం భుజ్‌ నుంచి 5 గంటలా 5 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ రైలు.. 360 కిలోమీటర్ల దూరంలోని అహ్మదాబాద్ జంక్షన్‌ను ఉదయం 10 గంటలా 50 నిమిషాల సమయానికి చేరుకుంటుంది. వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లతో పాటు కవచ్ వంటి భద్రతా పరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ రైలులో కనీస టికెట్ ధర 30 రూపాయలుగా ఉండనుంది. సోమవారం నాడు అహ్మదాబాద్‌- గాంధీ నగర్‌ మధ్య మెట్రో రెండో ఫేజ్‌ను కూడా మోదీ ప్రారంభించారు.






వందే భారత్‌ రైలు వ్యయం పెంచారంటూ దుష్ప్రచారం.. ఖండించిన రైల్వే శాఖ:


          ధనికులు మాత్రమే ప్రయాణించే వందే భారత్ రైలు తయారీ వ్యయాన్ని భారీగా పెంచి అవినీతికి పాల్పడుతున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ చేసిన విమర్శలను రైల్వే శాఖ ఖండించింది. తృణమూల్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే.. కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. 200 వందే భారత్ రైళ్ల తయారీ వ్యయానికి తొలుత కేంద్రం 58 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని.. ఇప్పుడు ఆ రైళ్ల సంఖ్యను 133 కి కుదించడం ద్వారా తయారీ వ్యయాన్ని 50 శాతానికి పెంచిందని సాకేత్ ఆరోపించారు. రైల్ తయారీ వ్యయాన్ని 290 కోట్ల రూపాయల నుంచి అమాంతం 430 కోట్లకు పెంచడానికి వెనుక మతలబు ఏంటని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ధనికులు మాత్రమే ప్రయాణించే మొత్తం ఏసీ బోగీలతో ఉండే ఈ రైళ్ల వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనం ఏంటని సాకేత్ నిలదీశారు. సాకేత్ ఆరోపణలపై రైల్వే శాఖ స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన రైల్వే శాఖ.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదని తెలిపింది. తొలుత ఈ రైళ్లలో 16 బోగీలు మాత్రమే ఉండేలా 200 రైళ్లకు కాంట్రాక్ట్‌కు ఇచ్చామని అయితే.. డిమాండ్ దృష్ట్యా ఈ రైళ్లు ఎక్కువ దూరం ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్లేలా.. వాటి బోగీల సంఖ్యను 24కి పెంచామని తెలిపింది. తద్వారా.. గతంలో ఉన్న బోగీల సంఖ్య 3200 కాగా ఇప్పుడు చేసిన మార్పులతో కూడా 133 రైళ్లలో 3 వేల 192గా ఉందని ఇందులో ఆరోపణలు చేయాల్సిన పనిలేదని రైల్వై శాఖ వివరణ ఇచ్చింది.  సాదారణ ప్రయాణికుల కోసం దేశవ్యాప్తంగా 12 వేల నాన్ ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.