Baramulla Encounter CC Footage Viral: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో (Baramulla) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా చాక్ తాప్పర్ క్రెరీలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు కరడుగుట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. దీనికి సంబంధించి డ్రోన్ ఫుటేజీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఓ ఇంటిపై సైన్యం తూటాల వర్షం కురిపించింది. ఈ క్రమంలో అందులో దాక్కున్న ఓ ఉగ్రవాది రైఫిల్‌తో కాల్పులు జరుపుతూ బయటకు వచ్చాడు. ఓ చోట పడిపోయి కొద్దిసేపు కాల్పులు జరిపాడు. అనంతరం లేచి పక్కనే ఉన్న పొదల్లో గోడచాటుకి వెళ్లి నక్కాడు. సైన్యం ఆ దిశగా తూటాల వర్షం కురిపించింది. అతను దాక్కొన్న పొదలపై తెల్లని పొగ కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.




ఉగ్ర చొరబాట్లకు యత్నాలు


కాగా, జమ్మూకశ్మీర్‌లో (Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పాక్ నుంచి ఉగ్ర కదలికలు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా మూడుసార్లు ఉగ్ర చొరబాట్లకు యత్నాలు జరగ్గా.. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు ఆవలి వైపు సిద్ధంగా ఉన్నట్లు సైన్యం గుర్తించింది. గత 7 రోజుల్లో నౌషేరా సెక్టార్, పూంఛ్ - దిగ్వార్, ఉదంపూర్, జమ్మూలోని కనాచక్ చొరబాట్లకు యత్నాలు జరిగాయి. ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని 24 స్థానాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సైన్యం భద్రత కట్టుదిట్టం చేసింది. ఉగ్రకదలికలు పెరుగుతున్న క్రమంలో ఎన్‌కౌంటర్లు వేగవంతం అవుతున్నాయి.


Also Read: Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్