Ravneet Singh Bittu: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత.. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి రన్‌వీత్‌ సింగ్ బిట్టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను నెంబర్‌ వన్ టెర్రరిస్టు అంటూ బిట్టూ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో సిక్కుల గురించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిట్టూ.. రాహుల్‌ చేసే వ్యాఖ్యలకు ఉగ్రవాదుల నుంచే మద్దతు ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ అసలు భారతీయుడే కాదని.. దేశం వెలుపలే ఆయన ఎక్కువ సమయం గడుపుతారని రన్‌వీత్‌ విమర్శించారు. ఆయనకు దేశం అంటేనే ప్రేమ లేదని.. విదేశీ గడ్డపై భారత దేశం గురించి తప్పుతప్పుగా మాట్లాడుతుంటారని బిట్టు మండిపడ్డారు.


ప్రపంచ దేశాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న వాళ్లు, దేశం ముక్కలవ్వాలని కోరుకునే సపరేటిస్ట్‌లు, బాంబులు తయారు చేసే వాళ్లు, గన్‌లు అమ్ముకొనే వాళ్లు మాత్రమే రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉంటారని అన్నారు. అమెరికా గడ్డపై మన దేశంలో సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖలిస్తానీ టెర్రరిస్టు పన్నుమ్ సమర్థించడంపై ఈ విధంగా బిట్టు విరుచుకు పడ్డారు. దేశంలో విమానాలు, రైళ్లు, రోడ్లను పేల్చి ప్రజల ప్రాణాలు తీయాలనుకునే వాళ్లందరూ రాహుల్ పక్షాన ఉంటూ ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంటారని.. అందుకే రాహుల్‌ గాంధీకి ఏదైనా అవార్డు ఇవాల్సి వస్తే నెంబర్‌ వన్ టెర్రరిస్టు, భారత్‌కు అతి పెద్ద శత్రువు అవార్డులు ఇవ్వచ్చని అన్నారు. గత సార్వత్రికం వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్న బిట్టూ జనరల్ ఎలక్షన్స్ సమయంలో భాజపాలో చేరి కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు.






బిట్టు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌:


          కేంద్ర మంత్రి రన్‌వీత్‌ సింగ్ బిట్టూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు బిట్టు వంటి వారి నుంచి మాత్రమే వస్తాయని.. అతడిపై జాలి పడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌ను పొగుడుతూ భాజపాను తిట్టిన అతడు ఇప్పుడు భాజపాలోకి వెళ్లి రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్న దీక్షిత్‌.. మళ్లీ పార్టీ మారినప్పుడు భాజపాపై ఈ వ్యాఖ్యలు చేస్తారని ఎద్దేవా చేశారు.


అసలు రాహుల్ గాంధీ ఏమన్నారంటే ..?


అమెరికా పర్యటనలో రాహుల్‌ గాంధీ.. సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ మత సంప్రదాయాలు పాటించే అవకాశం కూడా లేకుండా పోయిందంటూ విమర్శలు చేశారు. టర్బైన్ ధరించాలన్నా.. కాడ ధరించాలన్నా కేంద్రం అనుమతి కావారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.


సిక్కులు కనీసం గురుద్వారలోకి వెళ్లడం కూడా కష్టంగా మారిందన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. ఒక దశలో తాము భారత్‌లో సిరియా తరహా సర్కారుతో పోరాడుతున్నామంటూ వాషింగ్టన్‌లో రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారంటూ భాజపా విమర్శ లు కూడా గుప్పించగా.. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నుమ్‌ రాహుల్‌కు మద్దతు తెలపడంపై కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. రాహుల్ దేశానికి ఒక శాపంలా పరిణించాడన్న కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ.. విదేశాల్లో ఉంటున్న సిక్కులకు భయాందోళనలు కలిగించేలా రాహుల్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.


Also Read: వన్ నేషన్‌- వన్ ఎలక్షన్‌ సహా జనగణనపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం- కులగణన లేనట్టేనా!