Train Force One: ట్రైన్ ఫోర్స్‌వన్...ఇదేదో అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్‌లా ఉంది అనుకుంటున్నారా..! దీనికి దాదాపు అంత ఘన చరిత్రే ఉంది మరి. రెండేళ్లుగా రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్(Ukraine)లో వీవీఐపీలు ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన అత్యంత సౌకర్యవంతమైన రైలు ఇదే. ఎయిర్‌ఫోర్స్ వన్( Airforce One)ను తలదన్నే రీతిలో ఇందులు సౌకర్యాలు ఉన్నాయి. ఈనెల 23న భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సైతం ఇదే రైలులో ప్రయాణించి కీవ్‌కు చేరుకుంటారు. ఇప్పుడు ఆ రైలు విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఉక్రెయిన్‌లో మోడీ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటనకు బయలుదేరారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. రెండేళ్లుగా విరామం, విశ్రాంతి లేకుండా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నిత్యం బాంబుల మోతలు, రాకెట్ లాంఛర్ల తో గడగడలాడిపోతున్న ఉక్రెయిన్‌లో పర్యటన సాహసమనే చెప్పాలి. కానీ భారత ప్రధాని కన్నా ముందే ప్రపంచ దేశాల అధినేతలు సురక్షితంగానే పర్యటించారు. భీకర యుద్ధంలోనూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden)ప్రయాణించాడంటే ఉక్రెయిన్ వీవీఐపీ(V.V.I.P)లకు కల్పిస్తున్న భద్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు వారు ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ఉక్రెయిన్ గగనతలం రణరంగాన్ని తలపిస్తుండటంతో విమాన ప్రయాణం అంత సురక్షితంగా లేదు. అందుకే ఉక్రెయిన్‌లో పర్యటించే ఏ వీఐపీలు అయినా సరే ముందుగా పోలెండ్ చేరుకుని అక్కడి నుంచి రైలు మార్గంలో కీవ్‌కు చేరుకోవాల్సిందే. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ సైతం ఇదే విధంగా ఉక్రెయిన్ వెళ్లనున్నారు. అందుకోసం అత్యంత సురక్షితమైన రైలుగా పేరుగాంచిన ట్రైన్‌ఫోర్స్ వన్( Train Force One) సిద్ధం చేశారు.
ట్రైన్‌ఫోర్స్ వన్ విశేషాలు
రష్యాతో యుద్ధం మొదలైనప్పుటి నుంచి ఉక్రెయిన్‌లో ప్రయాణానికి భద్రత లేదు. దీంతో గగనతల మార్గం కాకుండా ఉక్రెయి రైలు మార్గాన్నే ఎంచుకుంది. యుద్ధ సమయంలో ఎంతోమంది ఉక్రెయిన్ వాసులను సురక్షిత ప్రాంతాలకు చేర్చిన ఈ రైలుబండి ఆ తర్వాత వివిధ దేశాధినేతలను కీవ్‌కు తరలించడంలోనూ అంతే పాత్ర పోషించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ వంటి దిగ్గజ నేతలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ సైతం తొలుత పోలెండ్ వెళ్లి అక్కడి నుంచి ఈ రైలులో 10 గంటల పాటు ప్రయాణించి ఉక్రెయిన్‌లో అడుగు పెట్టబోతున్నారు.
విలాస ప్రయాణం
పేరుకే ఇది రైలు బండి కానీ...ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నే రీతిలో ఏర్పాట్లు ఉన్నాయి. విలాసవంతమైన క్యాబిన్లు, సమావేశాల కోసం పెద్దపెద్ద సమావేశ మందిరాలు, రెస్ట్ తీసుకునేందుకు పడకగది సైతం ఉన్నాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ రైలు నిర్వహణ, భద్రత ఉక్రెయిన్‌కు సవాల్‌తో కూడిన వ్యవహారమైనప్పటికీ ...భారీ భద్రత నడుమ ఈ రైలును నడుపుతున్నారు. ఈ రైలు రాకపోకల విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉంచుతున్నారు. ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుని జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఇరుదేశాలకు నచ్చజెబుతోంది. యుద్ధం విరమించి శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరుతుంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కీవ్‌కు చేరుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చించనున్నారు. తిరుగు ప్రయాణంలోనూ మోదీ ఇదే రైలులో 10 గంటల పాటు ప్రయాణించి పోలెండ్ చేరుకుంటారు.