Russia-Ukraine War:
ఆయన చెప్పింది నిజం..
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయంగా ప్రముఖులు రోజూ ఏదో విధంగా చర్చిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో చాన్నాళ్లుగా మౌనంగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌తోనే నేరుగా మాట్లాడారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన కాలం కాదు" అని సున్నితంగానే విమర్శించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ మద్దతు పెరుగుతోంది. ఆ మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
మోడీని సపోర్ట్ చేయగా..ఇప్పుడు అమెరికాకు చెందిన సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ జనెట్ యెల్లెన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఇది యుద్ధాలు చేసుకోవాల్సిన కాలం కాదని భారత ప్రధాని మోడీ చెప్పిన మాటలు అక్షరాలా సత్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు" అని అన్నారు యెల్లెన్. "లక్షలాది మంది పేదరికంలో కూరుకుపోతున్నారు. ఇలాంటి కష్టకాలాలు మనకు పరీక్ష పెడుతుంటాయి. ఇలాంటి సవాళ్లు ఎదురైన ప్రతిసారి భారత్, అమెరికా మధ్య మైత్రి ఇంకా బలపడుతోంది" అని వెల్లడించారు. అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించేందుకు భారత్‌కు వచ్చారు యెల్లెన్. ఈ సందర్భంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నోయిడాలోని Microsoft India Development Centre బిజినెస్ లీడర్స్‌ను కలిశారు. "ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. కాలానికి అనుగుణంగా భారత్, అమెరికా మధ్య మైత్రి బలపడుతోంది. సప్లై చెయిన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సమష్టిగా పని చేయాల్సిన అవసరముంది" అని జనెట్ యెల్లెన్ అభిప్రాయపడ్డారు.
ఎస్‌సీఓ సమ్మిట్‌లో..
ఇటీవల షాంఘై సహకార సదస్సు (SCO)లో నేరుగా పుతిన్‌తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఆ సమయంలోనే యుద్ధం గురించి ప్రస్తావించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన కాలం కాదు. దీని గురించి గతంలోనే మీతో ఫోన్‌లో మాట్లాడాను. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకు నేందుకు మనకి ఇదో వేదిక. ఎన్నో దశాబ్దాలుగా భారత్-రష్యా మైత్రి కొనసాగుతోంది" అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. పలు దేశాల అధినేతలు ఆయన వ్యాఖ్యలపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పీఎం మోదీని ప్రశంసించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన సమయం కాదని భారత ప్రధాని మోదీ చెప్పిన విషయం అక్షరాలా నిజం" అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వెల్లడించారు. న్యూయార్క్‌లో జరిగిన 77వ సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మేక్రాన్. "పీఎం మోదీ చెప్పింది నిజం. పశ్చిమ దేశాలపై ఈ యుద్ధం ద్వారా పగ తీర్చుకోవాలనుకోవడం సరికాదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాల్సిన సమయమిది. అందరం కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి" అని అన్నారు.
పుతిన్ వివరణ..
అంతకు ముందు ఎస్‌సీఓ సమ్మిట్‌లో...ప్రధాని మోదీ పుతిన్‌తో యుద్ధం ఆపేయాలని సూచించారు. "వీలైనంత త్వరగా యుద్ధం ఆపివేయటం మంచిది" అని చెప్పారు. అయితే..దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. "ఉక్రెయిన్ విషయంలో మీ (భారత్) ఎటు వైపు ఉందో తెలుసు. మీ ఆందోళనలేంటో కూడా అర్థం చేసుకోగలను. ఈ యుద్ధాన్ని త్వరగా ఆపేయాలని మేమూ కోరుకుంటున్నాం. కానీ..ఉక్రెయిన్ ఇందుకు సహకరించటం లేదు. చర్చల విషయంలో ముందడుగు వేయటం లేదు. వాళ్ల డిమాండ్‌లు నెరవేర్చాలని మొండి పట్టు పడుతున్నాయి. అక్కడ ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు మీకు చెబుతూనే ఉంటాం" అని ప్రధాని మోదీకి వివరించారు పుతిన్.
Also Read: Vladimir Putin: పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుంది, అందుకే అక్కడికి రావటం లేదు - బ్రిటీష్ వార్తాసంస్థ