Modi on Kashmir Issue: 'ఆయన ఆ ఒక్కటి కూడా చేయలేకపోయారు'- నెహ్రూపై మోదీ విమర్శలు!

ABP Desam   |  Murali Krishna   |  10 Oct 2022 05:25 PM (IST)

Modi on Kashmir Issue: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై విమర్శలు చేశారు.

(Image Source: Twitter/@BJP4India)

Modi on Kashmir Issue: భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనంద్‌లో జరిగిన ర్యాలీ ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్యను ప్రధాని లేవనెత్తారు.

సర్దార్ సాహెబ్ అన్ని సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసేందుకు అందర్నీ ఒప్పించారు. అయితే 'ఒక వ్యక్తి' (నెహ్రూ).. కశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయారు. నేను సర్దార్ సాహెబ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. నేను ఆయన విలువలను పాటిస్తాను. అందుకే కశ్మీర్ సమస్యను పరిష్కరించాను. సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళులు అర్పించాను.                                                    -  ప్రధాని నరేంద్ర మోదీ

గుజరాత్ సీఎం అయినప్పుడు తనకు పరిపాలనలో పెద్దగా అనుభవం లేదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అయితే సీఎం భూపేంద్ర పటేల్‌కు పంచాయితీ నుంచి అసెంబ్లీ వరకు 25 ఏళ్ల అనుభవం ఉండడం మన అదృష్టమన్నారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు మోదీ గుజరాత్ పర్యటించనున్నారు.

త్రిముఖ పోరు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే భాజపా, ఆప్ ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తరచు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అటు...కాంగ్రెస్ గుజరాత్‌లో అధికారం కోల్పోయి 27 ఏళ్లు దాటింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టి...ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గుజరాత్‌లో ఆప్ గెలిస్తే...కేజ్రీవాల్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని 2024 ఎన్నికల్లో మోదీతో తలపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే...గుజరాత్‌లో గెలవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆప్. 

కేంద్ర మంత్రి అమిత్‌షా గుజరాత్‌లో ఇటీవల రెండ్రోజుల పాటు పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమై...ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఇకపై తరచుగా రాష్ట్రానికి వచ్చి స్థానిక నేతలతో భేటీ అవనున్నారు. ఈ వారం ప్రధాని మోదీ కూడా రెండ్రోజుల పాటు గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రూ.27,000కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అహ్మదాబాద్ ట్రైన్ సర్వీసులతో పాటు...గాంధీనగర్ నుంచి ముంబయి వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌నూ  అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. అటు ఆప్‌ నేతలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జ్ రఘు శర్మ...ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఆప్ మాత్రం ఈ విషయంలో ముందే ఉంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ఇప్పటికే 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

Also Read: Russia Ukraine War: 'ఇది ట్రైలర్ మాత్రమే- మా జోలికి వస్తే రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది'

Also Read: Babiya Crocodile Passes Away: ఆ 'శాఖాహార' మొసలి ఇక లేదు- ప్రసాదం తప్ప ఇంకేమీ తినేది కాదట!

Published at: 10 Oct 2022 05:23 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.