PM Modi Slams Congress: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ని గౌరవించాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాక్ వద్ద అణుబాంబులున్నాయని, అనవసరంగా కయ్యం పెట్టుకుంటే మనపై ప్రయోగించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండి పడుతుండగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా స్పందించారు. ఒడిశాలోని ర్యాలీలో మణిశంకర్ అయ్యర్ కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. పాక్ ఆర్థిక వ్యవస్థ గురించి ఎద్దేవా చేసిన మోదీ వాళ్ల దగ్గర ఉన్న అణుబాంబులను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేశారు. ఆ దేశం వద్ద అణుబాంబులున్నా...వాటిని ఎవరైనా కొంటారేమో అని ఎదురు చూస్తోందని అన్నారు. ఆ బాంబుల నాణ్యత కూడా సరిగ్గా లేకపోవడం వల్లే ఎవరూ ముందుకొచ్చి వాటిని కొనుగోలు చేయడం లేదని చురకలు అంటించారు. 


"కాంగ్రెస్ సొంత దేశ ప్రజల్నే భయపెట్టాలని చూస్తోంది. పాకిస్థాన్‌తో కయ్యం పెట్టుకోవద్దని సలహాలు ఇస్తోంది. మన దేశంపై దాడి చేస్తారని బెదిరిస్తోంది. పాకిస్థాన్ వద్ద అణుబాంబులున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. కానీ పాక్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్లకు ఆ బాంబులను ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం ఎవరైనా కొంటారేమో అని ఎదురు చూస్తోంది. కానీ వాటి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు"


- ప్రధాని నరేంద్ర మోదీ


 






మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తీవ్రంగానే స్పందించారు. పీవోకేపై గతంలో చేసిన వ్యాఖ్యలనీ తప్పుబట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికైనా భారత్‌దేనని స్పష్టం చేశారు.


"పాకిస్థాన్ వద్ద అణు బాంబులున్నాయని మణిశంకర్ అయ్యర్ బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా PoK గురించి ప్రస్తావించినప్పుడూ ఇదే విధంగా హెచ్చరించారు. కానీ వాళ్లందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్‌దే. ఏ శక్తీ దాన్ని ఆక్రమించలేదు" -


అమిత్ షా, కేంద్రహోం మంత్రి