PM Modi Special Selfie:
వైరల్ అవుతున్న సెల్ఫీ..
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 8) న చెన్నైలో పర్యటించారు. అక్కడ కొత్త ఎయిర్ పోర్ట్ టర్మినల్ ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని వచ్చే సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రధాని మోదీని కలిసేందుకు ఓ బీజేపీ కార్యకర్త వచ్చాడు. దివ్యాంగుడైన ఆ కార్యకర్తను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. అంతే కాదు. స్పెషల్ సెల్ఫీ కూడా తీశారు. ఈ ఫోటోలను తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు ప్రధాని మోదీ. ఆయన పని తీరుని ప్రశంసించారు.
"చెన్నైలో బీజేపీ కార్యకర్త మణికందన్‌ను కలిశాను. స్పెషల్ సెల్ఫీ తీసుకున్నాను. ఎరోడ్ జిల్లాలో బూత్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న మణికందన్‌ను చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను"
- ప్రధాని మోదీ
సెల్ఫీలు పోస్ట్ చేసిన మోదీ...ఆ కార్యకర్త లైఫ్ స్టోరీని పంచుకున్నారు. ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తి అంటూ అభినందించారు. ట్విటర్‌లో ఆ కార్యకర్తను అభినందిస్తూ తమిళ్‌లో ట్వీట్ చేశారు.
"మణికందన్ దివ్యాంగుడే కావచ్చు. కానీ సొంతగా టీ షాప్ నడుపుతున్నాడు. అంత కన్నా గొప్ప విషయం ఏంటంటే...రోజూ ఆయను వచ్చే లాభాల నుంచి కొంత మేర పార్టీకి నిధుల రూపంలో అందిస్తాడు. ఇలా మా అందరికీ స్ఫూర్తి పంచుతున్నాడు. ఇలాంటి కార్యకర్తలుండటం బీజేపీకి ఎంతో గర్వకారణం. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. మా పార్టీ విధానానికీ ఆయన కట్టుబడి ఉన్నాడు. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"
- ప్రధాని మోదీ
శనివారం చెన్నైలో పర్యటించిన ప్రధాని మోదీ కొత్త ఎయిర్ పోర్ట్ టర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు రూ.5,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ నిబద్ధతే ఈ స్థాయిలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి కారణమైందని చెప్పారు.
"మౌలిక వసతుల నిర్మాణం అంటే కేవలం కాంక్రీట్, ఇటుకలు, సిమెంట్..ఇవే కాదు. బీజేపీ సిద్ధాంతం ఇది కాదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం అంటే ఎంతో మంది ఆశల్ని, ఆశయాల్ని, లక్ష్యాల్ని అనుసంధానించడం. పనితీరు, విజన్. ఇవే మేం లక్ష్యాలు సాధించేందుకు ఊతమిస్తున్నాయి. గతంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు అంటే ఏళ్ల పాటు జాప్యం జరిగేది. ఇప్పుడు ఆ తీరు మారిపోయింది. ప్రజలు చెల్లించే పన్నుల్లో ప్రతి రూపాయికీ మేం జవాబుదారీతనంగా ఉంటాం. మా అంతట మేమే డెడ్‌లైన్స్ పెట్టుకుంటాం. ఆలోగా పనులు పూర్తి చేసి తీరతాం. "
- ప్రధాని మోదీ
Also Read: PM Modi Karnataka Visit: స్పోర్ట్స్ లుక్‌లో మెరిసిన ప్రధాని మోదీ, టైగర్ రిజర్వ్‌లో సఫారీ