PM Modi: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న అలజడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. అక్కడి భద్రతపై సమీక్ష జరిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని అధికారులకు సూచించారు. గత నాలుగు రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు తెగబడుతున్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొందరి ఊహా చిత్రాలనూ విడుదల చేశారు. ఈ క్రమంలోనే మోదీ అక్కడి పరిస్థితులను సమీక్షించారు.


ఈ భేటీలో అజిత్ దోవల్ మోదీ అక్కడి స్థితిగతులూ పూర్తి స్థాయిలో వివరించారు. సాయుధ బలగాలు ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుందో కూడా తెలిపారు. ఈ మేరకు మోదీ కొన్ని సూచనలు చేశారు. అవసరమైనతే భారీ మొత్తంలో సాయుధ బలగాలను మొహరించి ఉగ్రవాదుల్ని ఏరి వేయాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపైనే మోదీ అమిత్ షాతో కూడా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. స్థానిక అధికార యంత్రాంగం ఉగ్రదాడులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపడుతోందో అడిగి తెలుసుకున్నారు. 






దొడ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ సైనికుడు గాయపడ్డాడు. దొడ జిల్లాలో ఇలా దాడి జరగడం రెండోసారి. నాలుగు రోజుల్లో నాలుగు సార్లు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. జూన్ 9వ తేదీన రేసీ జిల్లాలో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత భద్రతా బలగాలు ఉగ్రవేట మొదలు పెట్టాయి. కథువా జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. దొడలో ఎత్తైన పర్వతాల్లో నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. అక్కడి వరకూ వెళ్లి వాళ్లను మట్టుబెట్టడం సవాల్‌గా మారుతోంది. చత్తర్‌గల్లా వద్ద వాళ్ల కోసం గాలిస్తుండగా ఉన్నట్టుండి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన ఐదుగురు సైనికులతో పాటు ఓ సీనియర్ పోలీస్ అధికారి గాయపడ్డారు. 






Also Read: Interchange Fee: ఏటీఎమ్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో, ఇకపై ఛార్జీల బాదుడు అలా ఉంటుందట మరి!