How To Activate Frozen NPS Account Online: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) అనేది మన దేశంలో బాగా పాపులర్‌ అయిన పెన్షన్‌ పథకం (Retirement Scheme). దీనికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రన్‌ అవుతుంది కాబట్టి సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి నష్ట భయం ఉండదు. ఎన్‌పీఎస్‌కు కాంట్రిబ్యూట్‌ చేసిన వ్యక్తి రిటైర్‌ అయిన తర్వాత నెలనెలా పెన్షన్‌ అందుతుంది, పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థిక భద్రత లభిస్తుంది. 


నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ 2004లో 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (Pension Fund Regulatory and Development Authority) ప్రారంభించింది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరుడు ఎవరైనా NPS సబ్‌స్క్రైబర్‌గా మారొచ్చు/ ఖాతా ప్రారంభించొచ్చు. ఎన్‌పీఎస్‌ ఖాతాను వినియోగించడం చాలా సౌకర్యవంతంగా, సులభం ఉంటుంది. NPS ఖాతా ప్రారంభించిన వ్యక్తి, ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.1,000 కనీస మొత్తాన్ని (Minimum Annual Contribution For NPS Account) కాంట్రిబ్యూట్‌ చేయాలి/ ఖాతాలో జమ చేయాలి.


ఖాతాలో కనీస వార్షిక మొత్తం జమ చేయకపోవడం, సబ్‌స్క్రిప్షన్ ఫారాన్ని సమర్పించకపోవడం, KYC అప్‌డేట్‌ చేయకపోవడం సహా కొన్ని రకాల కారణాల వల్ల సబ్‌స్క్రైబర్‌ NPS ఖాతా నిష్క్రియంగా మారొచ్చు. అయితే, NPS అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందని కంగారు పడాల్సిన పని లేదు. ఆ ఖాతాను తిరిగి క్రియాశీలం చేయడం/ అన్‌ఫ్రీజ్ చేయడం చాలా సులభం. అయితే, ఖాతా ఫ్రీజ్‌ కావడానికి గల కారణాన్ని ముందుగా గుర్తించాలి. కారణం తెలిస్తే చాలు, స్తంభించిన NPS ఖాతాను ఆన్‌లైన్‌లో రీయాక్టివేట్‌ చేయొచ్చు. 


ఫ్రీజ్‌ అయిన ఎన్‌పీఎస్‌ ఖాతాను ఎలా యాక్టివేట్‌ చేయాలి? 


-- ముందుగా, NPS అధికారిక వెబ్‌సైట్‌ https://cra-nsdl.com లోకి వెళ్లాలి.
-- లాగిన్‌ కావడానికి ‘NPS Login’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ PRAN (Permanent Retirement Account Number), పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. 
-- ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత 'Contribution' ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయాలి.
-- 'Contribution' ట్యాబ్ కింద, ఖాతాను క్రియాశీలం చేసేందుకు ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
-- మీ NPS ఖాతాలోకి మీ నుంచి మినిమమ్‌ కాంట్రిబ్యూషన్‌ ఉందో, లేదో ఇక్కడ తనిఖీ చేయండి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం రూ.1,000.
-- ఇప్పటి వరకు కనీస మొత్తం చెల్లించకపోతే, ముందు పేమెంట్‌ చేయాలి. దీనికోసం నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.
-- పేమెంట్‌ చేయడానికి ముందు అన్ని వివరాలను మరోసారి సరి చూసుకోండి.
-- వివరాలన్నీ సరిగా ఉంటే, 'Proceed' బటన్‌పై క్లిక్‌ చేయండి.
-- పేమెంట్‌ పూర్తి చేయడానికి మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్‌ చేయండి. “Captcha” కూడా ఎంటర్‌ చేయాలి. 
-- పేమెంట్‌ విజయవంతం అయిన తర్వాత స్క్రీన్‌ మీద మీకు కన్ఫర్మేషన్ మెసేజ్‌ కనిపిస్తుంది.
-- ఈ లావాదేవీ తర్వాత మీకు రిసిప్ట్‌ అందుతుంది. భవిష్యత్ అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
-- మీ NPS ఖాతా రెండు రోజుల లోపు యాక్టివేట్‌ అవుతుంది. దీనికి సంబంధించి మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు SMS, ఈ-మెయిల్‌ వస్తుంది. 


చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తముడి లక్షణం. ఎన్‌పీఎస్‌ ఖాతా స్తంభించిపోయే వరకు ఆగకుండా, గుర్తు పెట్టుకుని రెగ్యులర్ కంట్రిబ్యూషన్స్‌ చేస్తుండాలి. ఖాతాలో KYC అప్‌డేట్‌ చేయాలి. దీనివల్ల, మీ ఖాతాకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ల రూపంలో ఎప్పటికప్పుడు మీకు అందుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ ఫామ్స్‌ ఉంటేనే బ్యాంక్ FDపై పన్ను ఆదా - లేకపోతే వడ్డీ నష్టం!