Mohan Charan Majhi: దాదాపు పాతికేళ్ల తరవాత ఒడిశాలో బిజూ జనతా దళ్ (BJD) పాలనకు బ్రేక్ పడింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో అప్పుడే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పూరీజగన్నాథుని ఆలయంలో ఇప్పటి వరకూ ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు సిద్ధమైపోయారు. అందులో భాగంగానే ఆలయంలో (Shree Jagannath Temple) ఇన్నాళ్లూ మూతపడి ఉన్న నాలుగు గేట్‌లనూ తెరిచేందుకు ఆమోదం తెలిపారు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. శతాబ్దాల కిందటి ఆలయాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాలుగు ద్వారాలను తెరవడమే కాకుండా ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్‌నీ కేటాయించనున్నారు. మంత్రులంతా కలిసి ఈ నాలుగు ద్వారాలనూ తెరుస్తారని ముఖ్యమంత్రి మాఝీ ప్రకటించారు. ఆ నాలుగు గేట్‌ల నుంచీ భక్తులకు లోపలికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు.
ఆలయంలోని నాలుగు ద్వారాలనూ తెరుస్తామని బీజేపీ మేనిఫెస్టోలోనే ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ హామీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కొవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచీ ఈ నాలుగు గేట్‌లనూ మూసేసింది. భక్తులు లోపలికి రావాలంటే ఒకటే ద్వారం అందుబాటులో ఉంది. మిగతావి కూడా తెరవాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ పని చేసింది. ఇక ఆలయ ఆభివృద్ధి పనులు, ఇతరత్రా కార్యక్రమాల కోసం రూ.500 కోట్లతో కూడిన కార్పస్ ఫండ్‌ని కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.