Pema Khandu Takes Oath as CM: అరుణాచల్ ప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు పేమా ఖండు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పేమా ఖండుతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. డిప్యుటీ సీఎంగా చౌనా మీన్ బాధ్యతలు తీసుకున్నారు. 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 46 చోట్ల విజయం సాధించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ బీజేపీని ముందుండి నడిపించారు పేమా ఖండు. అందుకే ఆయనకు మరోసారి సీఎం పదవిని అప్పగించింది హైకమాండ్.
కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు పేమా ఖండు. 2016లో తొలిసారి అరుణాచల్ ప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ సీఎంగా ఉన్న నబత్ తుకీ స్థానంలో ఖండు వచ్చారు. ఆ తరవాత అక్కడి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆపరేషన్ లోటస్ కారణంగా ఖండుతో పాటు ఆయన వర్గంలోని 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీ మిత్రపక్షమైన People's Party of Arunachal లోకి వెళ్లిపోయారు. కానీ అక్కడ సస్పెన్షన్‌కి గురయ్యారు. మెజార్టీ నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత కూడా ఊహించని పరిణామాలు జరిగాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అప్పుడు మెజార్టీ నిరూపించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 2019లోనూ ఇదే జోరు కొనసాగించిన ఆయన ఇప్పుడు కూడా బీజేపీని గెలిపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న క్రమంలోనే పేమా ఖండు అరుణాచల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
"అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు నా శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీపై వాళ్లు విశ్వాసం ఉంచారు. అందుకు తగ్గట్టుగానే మేమంతా కలిసి ఇక్కడి ప్రతి వర్గానికీ సంక్షేమం అందేలా కృషి చేస్తాం. మీరందరూ మద్దతు ఇస్తున్న కారణంగానే పార్టీ ఈ స్థాయిలో ఎదిగింది. ఆత్మనిర్భర అరుణాచల్ ప్రదేశ్‌ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం"
- పేమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
Also Read: G7 Summit: సభ్య దేశం కాకపోయినా ప్రతిసారీ ఆహ్వానం, G7 సదస్సుకి పెద్ద దిక్కుగా భారత్