India's Role in G7 Summit: ఇటలీలోని G7 సదస్సుని చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఆ సమావేశంలో చర్చకు రానున్నాయి. G7 లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రిటన్ దేశాలున్నాయి. ఇందులో భారత్ సభ్య దేశం కాకపోయినప్పటికీ 2019 నుంచి ఈ సదస్సు నిర్వహించిన ప్రతిసారీ ఆహ్వానం అందుతోంది. మిగతా దేశాలు అంతగా ఇండియాకి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. అందులో మొట్టమొదటికి మన దేశ జీడీపీ. 3.94 లక్షల కోట్ల డాలర్ల GDPతో భారత్‌ దూసుకుపోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే G7 సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థ కన్నా భారత్‌ ఎకానమీ మెరుగ్గా ఉంది. G7 లోని అన్ని దేశాలతోనూ భారత్‌కి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అమెరికా, యూకే, జపాన్‌, ఫ్రాన్స్‌ ఇలా అన్ని దేశాలతోనూ పరస్పర సహకారం అందుతోంది. 


ఇక ఈ సారి సదస్సులో అత్యంక కీలకంగా చర్చకు వచ్చే  Indo-Pacific అంశమూ మరో కారణం. చైనా దూకుడుకి కళ్లెం వేయాలంటే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అదంతా సాధ్యం కావాలంటే G7 దేశాలకు భారత్ సహకారం అత్యవసరం. ఇది కాకుండా ఇటలీ, రష్యాతో పాటు ఆఫ్రికా దేశాలతోనూ భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాలను ఎలా డీల్ చేయాలో భారత్‌కి అనుభవముంది. అందుకే G7లో సభ్యత్వం లేకపోయినా సరే ఆ దేశాలన్నీ ఇండియాకి ఇన్విటేషన్ పంపుతున్నాయి. 


యువ జనాభా..


అంతకు ముందు ఈ సమ్మిట్‌ ఫ్రాన్స్‌లో జరగ్గా అప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రధాని మోదీకి ఆహ్వానం అందించారు. ఆ సదస్సుకీ మోదీ  హాజరయ్యారు. కేవలం భారత్‌నే కాకుండా G7 లోని ఇతర దేశాలకూ ఆహ్వానాలు అందుతున్నాయి. టర్కీ, సౌదీ అరేబియా, యూఏఈ, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల అధినేతలకు స్వాగతం పలుకుతోంది ఈ G7 సదస్సు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆహ్వానాలు పంపుతోంది. వీటిలో భారత్‌కి అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది. జనాభా విషయంలో చైనాని దాటేసింది ఇండియా. పైగా ఇక్కడ యువత సంఖ్య ఎక్కువ. జనాభాలో 65% మేర 35 ఏళ్ల లోపు వాళ్లే ఉన్నారు. వీళ్లలో ఎంతో మంది నిపుణులూ ఉన్నారు. ఈ వర్క్‌ఫోర్స్‌తో ప్రపంచానికి చాలా అవసరముంది. 


చమురు కొరత తీర్చిన భారత్..


ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసేందుకు భారత్ మాత్రమే. అటు ఐరోపా దేశాలన్నీ చమురు లేక చాలా అవస్థలు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కి మాత్రం రష్యా పెద్ద మొత్తంలో ఎగుమతి చేసింది. ఆ సమయంలో ఐరోపా దేశాలన్నీ భారత్‌పైనే ఆధారపడ్డాయి. రిఫైన్డ్‌ ఫ్యుయెల్‌ని ఐరోపా దేశాలకు అందించింది. అలా అక్కడి సంక్షోభాన్ని కొంత వరకూ తీర్చగలిగింది. దీని తరవాత ఐరోపా దేశాలకు భారత్‌పై భరోసా పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి G7 సభ్య దేశాలు. అందుకే భారత్‌కి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాయి. 


Also Read: G7 Summit 2024: G7 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు బెైడెన్‌, ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ!