G-7 Summit: ఇటలీలోని G7 సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ప్రత్యేకంగా భేటీ అవుతారని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెల్లడించారు. జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. అయితే...ఈ భేటీకి సంబంధించి భారత్ నుంచి అధికారికంగా ఆమోదం లభించాలని వివరించారు. ఇంకా షెడ్యూల్‌ని ఖరారు చేయాల్సి ఉందని వెల్లడించారు. అంతకు ముందు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు. 


G7 సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరు కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఈ వేదికగా చర్చ జరగనుంది. అంతే కాదు. ఉక్రెయిన్‌కి సైనిక సాయం అందించేందుకు వీలుగా ఓ సెక్యూరిటీ అగ్రిమెంట్‌ కూడా కుదిరే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందంపై బైడెన్, జెలెన్‌స్కీ సంతకాలు పెడతారని Reuters వెల్లడించింది. ఇప్పటికే ఇటలీకి బయల్దేరారు బైడెన్. అక్కడ రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చి ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేలా ప్రయత్నించనున్నారు. ఉక్రెయిన్‌కి దీర్ఘకాలం పాటు రక్షణా రంగంలో సహకారం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఇప్పటికే బైడెన్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా రష్యా పునరాలోచించి ఉక్రెయిన్‌పై యుద్ధంపై ఓ నిర్ణయం తీసుకోవాలని అమెరికా సూచిస్తోంది.