Nara Chandrababu Naidu Grandson Devansh Net Worth: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం (12 జూన్ 2024) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ఏపీ సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకార వేడుకలో... ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) నారా చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, ఆయనకు సంబంధించిన కొన్ని కంపెనీలు వార్తల్లో నిలుస్తున్నాయి. స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా కంపెనీల షేర్ ధరలు మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో, చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యుల (Chandrababu Naidu Family) ఆస్తుల విలువ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు, చంద్రబాబు 9 ఏళ్ల మనవడు దేవాన్ష్ నాయుడు కూడా జాతీయ వార్తల్లో హెడ్‌లైన్‌గా మారాడు. దేవాన్ష్ కూడా 9 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడని జాతీయ పత్రికలు కథనాలు రాశాయి. చంద్రబాబు ఫ్యామిలీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర (Heritage Foods Share Price) పెరగడంతో దేవాన్ష్ నాయుడి నికర విలువ (Nara Devansh Net Worth) పెరిగింది.
మ్యాజిక్ చేసిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు
లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Elections 2024) పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. కేంద్రంలో అధికార NDA కూటమిలో TDP కూడా భాగమే. లోక్‌సభ ఎన్నికల్లో BJPకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో, TDP బలం కీలకంగా మారింది. అంటే, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో, పెట్టుబడిదార్లు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను ఎగబడి కొనడం ప్రారంభించారు, స్టాక్ ధర నిరంతరం పెరగడానికి ఇదే కారణం. గత 12 ట్రేడింగ్ సెషన్లలో ఈ కంపెనీ షేర్ ధర దాదాపు రెండింతలు పెరిగింది.
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో నారా చంద్రబాబు నాయుడు & అతని కుటుంబానికి దాదాపు 35.7 శాతం వాటా ఉంది. చంద్రబాబు భార్య భువనేశ్వరికి 24.37 శాతం వాటా, కుమారుడు లోకేష్‌కు 10.82 శాతం వాటా, కోడలు బ్రాహ్మణికి 0.46 శాతం వాటా, మనవడు దేవాన్ష్‌కు 0.06 శాతం వాటా ఉన్నాయి.
దేవాన్ష్ షేర్ల విలువ రూ.4.1 కోట్లు
హెరిటేజ్ ఫుడ్స్‌లో దేవాన్ష్ నాయుడికి 56,075 షేర్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు, అంటే 2024 జూన్ 3న ఈ షేర్ల విలువ రూ.2.4 కోట్లుగా ఉంటే, ఇప్పుడు ఆ విలువ రూ.4.1 కోట్లకు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ప్రైస్ పెరగడంతో నాయుడు కుటుంబ సంపద రూ.1225 కోట్లు పెరిగింది.
హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని 1992లో స్థాపించారు. ఇది బ్రాండెడ్ పాలు, పెరుగు, నెయ్యి, జున్ను, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులను 11 రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఈ ఉత్పత్తులను దాదాపు 15 లక్షల ఇళ్లలో ఉపయోగిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: కేంద్ర కేబినెట్‌లో అపర కుబేరులు - టాప్ ప్లేస్‌లో తెలుగు మంత్రి