Telugu News Today: మీరు ఎప్పుడైనా ఫింగర్ చిప్స్ తిన్నారా? టమాటా సాస్‌తో కలిపి తింటే దాని టేస్ట్ అదరహో అనే స్టైల్లో ఉంది. కానీ ఫింగర్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? ఇదేంటి ఫింగర్ చిప్స్‌తో పాటు ఫింగర్ ఐస్ క్రీమ్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? మామూలుగా ఐస్ క్రీముల్లో చాలా రకాలు ఉంటాయి. వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, చాక్లెట్ ఇలా చాలా ఫ్లేవర్ల ఐస్ క్రీములు మనం చూసే ఉంటాం. ఎండల్లో బయట తిరిగి ఇంటికి వచ్చి చల్లని ఐస్ క్రీమ్ తింటూ సేదతీరుతూ ఉంటాం. అయితే ముంబైలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ఇంకో సారి ఐస్ క్రీమ్ తినాలంటేనే ఆలోచిస్తారు.
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉంటున్న ఓ వైద్యుడికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకపోయింది. అంతే ఆ డాక్టర్ ఇంట్లో నుంచే ఓ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లో ఐస్ క్రీమ్ ఇంటికి డెలివరీ అయ్యింది. ఎంతో ఆశగా ఐస్ క్రీమ్ తింటున్న అతనికి ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో గట్టిగా ఉన్న వస్తువు అతని నోటికి తగిలింది. తీరా ఏంటని చూస్తే గుండె బద్దలయ్యే సీన్ కనిపించింది. ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు బయపడడంతో సదరు డాక్టర్ షాక్ అయ్యాడు.
అసలేం జరిగిందంటే
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) అనే వైద్యుడు నివాసం ఉంటున్నాడు. ఐస్ క్రీమ్ ప్రియుడైన ఆయనకు బుధవారం ఐస్ క్రీమ్ తినాలనిపించింది. జెప్టో యాప్ ద్వారా బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు. కొద్ది నిమిషాల్లోనే ఆర్డర్ ఇంటికి వచ్చింది. ఐస్ క్రీమ్‌ను చేత్తో తీసుకుని నోటితో చప్పరించడం మొదలు పెట్టాడు. కొద్ది సెకన్లకే అతని నోటికి ఏదో గట్టిగా తగలడం ప్రారంభమైంది. దీంతో అనుమానం వచ్చి ఐస్‌క్రీమ్‌ను చెక్ చేస్తే అందులో రెండు సెంటీమీటర్ల మనిషి వేలు కనిపించింది. అంతే సెర్రావ్ కాస్తా షాక్‌కు గురయ్యాడు.
పోలీసులకు ఫిర్యాదు
స్వతహాగా డాక్టర్ అయిన సెర్రావ్ తనకు జరిగిన దానిపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మలాడ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి ఐస్‌క్రీమ్‌లో వచ్చిన వేలు ముక్కను స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, ఐస్ క్రీమ్ తయారు చేసిన, ప్యాకింగ్ అయ్యే ప్రదేశాలను తనిఖీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై వివరణ కోరేందుకు ఐస్‌క్రీం తయారీ సంస్థను సంప్రదించేందుకు యత్నించగా తయారీ దారులు స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ అయ్యింది.
ఖమ్మంలో ఇలాంటి ఘటనే
తెలంగాణలోని ఖమ్మంలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. చికెన్ బిర్యానీలో బొద్దింక బయపడింది. ఖమ్మంలోని రాయల్ గ్రాండ్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో షాక్‌కు గురైన వినియోగదారులు రెస్టారెంట్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా దానిని రెస్టారెంట్ యజమాని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆగ్రహించిన వినియోగదారులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని రెస్టారెంట్ యజమానిని నిలదీశారు. అంతే రెస్టారెంట్ యజమానికి తీవ్ర కోపం వచ్చింది. "ఇంట్లో మీ పెళ్లాం వండిన బిర్యానీలో బొద్దింక రాదా?" అంటూ అధికారులతో దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో అధికారులు రెస్టారెంట్‌పైన కఠిన చర్యలకు ఉపక్రమించారు.