2036 Olympics in India: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ లేనంతగా దాదాపు 98 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్పీచ్‌లో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ అభివృద్ధి నుంచి మహిళల భద్రత, ఒలింపిక్స్‌ వరకూ అన్ని అంశాలూ మాట్లాడారు. అయితే...ఒలింపిక్స్ గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు ప్రధాని. 2036 నాటికి ఒలింపిక్స్‌ని భారత్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అప్పుడు భారత్‌ ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయితే..2036 నాటి ఒలింపిక్స్‌ని హోస్ట్ చేసేందుకు భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ పోటీ పడుతున్నాయి. ఈ క్రీడలు ఎక్కడ నిర్వహించాలన్నది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నికలూ జరుగుతాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 2036లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చే దేశమేదో తేలిపోతుంది. ప్రధాని మోదీ మాత్రం భారత్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. 


"2036 లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యం అందించాలన్నది భారత్ కల. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం"


- ప్రధాని నరేంద్ర మోదీ






ఇదే సమయంలో G20 సదస్సు గురించి ప్రస్తావించారు ప్రధాని. భారత్‌ విజయవంతంగా ఈ సదస్సుని నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ సమ్మిట్ తరవాతే భారత్‌ ఎలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలనైనా నిర్వహించగలదన్న నమ్మకం వచ్చిందని తేల్చి చెప్పారు. ఇదే నమ్మకం ప్రపంచానికీ కలిగింది అన్నారు. అందుకే ఒలింపిక్స్‌ నిర్వహణపైనా మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే International Olympic Committee చీఫ్ థామస్ బచ్ భారత్‌కి మద్దతు పలికారు. 2010లో చివరిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌ని నిర్వహించింది భారత్. ఢిల్లీ వేదికగా ఈ క్రీడలు జరిగాయి. ఒకవేళ 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ జరిగితే అహ్మదాబాద్ అందుకు వేదిక అవుతుందని సమాచారం. 


(Also Read: Mpox Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న మరో ప్యాండెమిక్! గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO)


పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు కనబరిచిన ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌కి ఆరు మెడల్స్ మాత్రమే వచ్చినప్పటికీ వాళ్ల పడ్డ శ్రమను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తరపున వాళ్లకు అభినందనలు తెలిపారు. ఒక వెండి పతకంతో పాటు ఐదు కాంస్య పతకాలు సాధించుకుంది భారత్. ఈ సందర్భంగా మోదీ మను భాకర్‌తో పాటు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పారిస్‌లో పారాలింపిక్స్‌ జరగనున్న క్రమంలో ఇండియన్ అథ్లెట్స్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 


Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు