Kolkata Doctor Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ మాటల్లో చెప్పలేనంత హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనమైంది. "మరీ ఇంత పాశవికమా" అని ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్‌లో నుంచి తేరుకోలేదు. కూతురి డెడ్‌బాడీ చూసేందుకు మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో కీలక విషయమూ చెప్పారు. ట్రైనీ డాక్టర్‌కి రోజూ డైరీ రాసే అలవాటు ఉందట. ఈ దారుణానికి కొద్ది గంటల ముందు డైరీ రాసింది. "ఎగ్జామ్‌లో టాప్‌ రావాలి. గోల్డ్‌మెడల్ సాధించాలి" అని రాసుకుంది. ఆ తరవాత ఇంటి నుంచి నైట్‌షిఫ్ట్‌ కోసం హాస్పిటల్‌కి బయల్దేరింది. ఇదంతా బాధితురాలి తండ్రి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. "నా కూతురికి చదువంటే పిచ్చి. రోజుకు 10-12 గంటలు చదువుతూనే ఉండేది. కానీ ఇప్పుడు ఏం మిగిలింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. 


"నా కూతురు పుస్తకాల పురుగు. రోజంతా బుక్స్‌తోనే గడిపేది. చాలా కష్టపడింది. MD ఎగ్జామ్‌లో టాప్‌ రావాలని అనుకుంది. గోల్డ్ మెడల్ సాధించాలనీ డైరీలో రాసుకుంది. కానీ..ఆ కలలన్నీ చెదిరిపోయాయి. తను డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చేందుకు జీవితంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో త్యాగాలు చేశాం"


- బాధితురాలి తండ్రి


ఎవరు ఎలా ఓదార్చినా, ఏం ప్రశ్నించినా బాధితురాలి తల్లిదండ్రులు ఒకటే మాట చెబుతున్నారు. "నా కూతురు ఎలాగో చనిపోయింది. కనీసం న్యాయం జరగాలి. ఈ సమయంలో మేం ధైర్యంగా ఉండాలి. నమ్మకం కోల్పోకూడదు. దేశవ్యాప్తంగా మాకు వస్తున్న మద్దతు మాకు ఎంతో ధైర్యాన్నిస్తోంది" అని అంటున్నారు. ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిగి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముందని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిందితులకు శిక్ష వేయాలని కోరుకుంటున్నారు. 


Also Read: Upasana: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్