Anna Canteens In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అన్న క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు అక్కడ అందరితో కలిసి భోజనం చేశారు. తొలి విడతగా వంద అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఇవాళ గుడివాడలో తొలి క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మిగతా 99 రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు. అనంతరం వారందరితో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు.
మిగత క్యాంటీన్లు శుక్రవారం ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మూసివేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ వాటిని పునః ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అన్నింటినీ ఒకేసారి సెప్టెంబర్‌లో పునః ప్రారంభిచాలని అనుకున్నారు. అయితే కొన్ని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయినందుకు ఇప్పుడు వంద వరకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మిగతావి వచ్చే నెలలో ప్రారంభిస్తారు.
టిఫిన్‌లో ఏం ఇస్తారు
టిఫిన్ టైంలో ఇడ్లీ చట్నీ లేదా ఏదైనా పొడి, సాంబార్ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకుంటే సోమవారం, గురువారం పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్, చట్నీ, మిక్చర్ వడ్డిస్తారు. టిఫిన్‌లో మూడు ఇడ్లీ లేదా పూరి, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు ఇస్తారు.
భోజనంలో ఎప్పుడు ఏం పెడతారు?
సోమవారం నుంచి శనివారం వరకు రోజూ మధ్యాహ్నం, రాత్రిపూట ఇక్కడ భోజనం పెడతారు. అన్నంతోపాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి ఉంటుంది. ఆదివారం మాత్రం క్యాంటీన్లకు సెలవు ఉంటుంది. భోజనం సమయంలో 400 గ్రాముల అన్నం, పప్పు 120 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందిస్తారు. ఉదయం 7.30 నిమిషాలకే క్యాంటీన్ తెరుస్తారు. పది గంటల వరకు టిఫిన్ అందిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు భోజనం వడ్డిస్తారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు భోజనం పెడతారు.