PM Modi Cabinet: ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హితబోధ చేశారు. వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీలందరికీ అభినందనలు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పనులు కొనసాగించాలని సూచించారు. 100 రోజుల ప్రణాళికను రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా అభివృద్ధి పనులు ఆగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఈ భేటీపై బీజేపీ ఎంపీ మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో ఉండాల్సిన నేతలకు మోదీయే స్వయంగా కాల్ చేసి పిలిచారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశామని, వచ్చే 24 గంటల పాటు తనను ఢిల్లీలోనే ఉండాలని మోదీ చెప్పారని ఖట్టర్ తెలిపారు.
100 రోజుల ప్లాన్ సిద్ధం..
నిజానికి ఎన్నికల ఫలితాల ముందే ప్రధాని నరేంద్ర మోదీ 100 Day Plan ని సిద్ధం చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. హ్యాట్రిక్ సాధిస్తామని ముందు నుంచే ధీమాగా చెబుతున్న మోదీ ముందు చూపుతో వచ్చే ఐదేళ్ల పాటు పరిపాలన అందించాలని నేతలతో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సారి ఎవరూ ఊహించని రీతిలో కొందరికి కేంద్రమంత్రి పదవులు అప్పగించారు మోదీ. మోదీతో పాటు వీళ్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇటు తెలంగాణలోనూ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయి. కేబినెట్ కూర్పు అంతా పూర్తై ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి 100 రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు మోదీ. కేవలం ఎన్నికల ముందు హడావుడి చేసే ప్రభుత్వం తమది కాదని, మొదటి వంద రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు.
Also Read: Modi 3.0 Cabinet: అన్నామలై అంటే అంత ఇష్టం దేనికి - మోదీ నిర్ణయం వెనుక అంత పెద్ద కారణముందా?