PM Modi BJP's Majority: ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 400 సీట్లు కచ్చితంగా సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి చరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. తమ పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాంటిదని, ప్రజలు తమకు తప్పకుండా ఈ మెజార్టీని అందిస్తారన్న నమ్మకముందనీ చెబుతున్నారు. మోదీకి ఎందుకంత కాన్ఫిడెన్స్..? 400 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చారు ప్రధాని. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. 


"దేశ ప్రజలందరికీ మా ప్రభుత్వంపై గట్టి నమ్మకముంది. వాళ్ల బాధల్ని అర్థం చేసుకునే ప్రభుత్వం మాది. వాళ్లకి సముచిత గౌరవమిచ్చి వాళ్ల కలలను నెరవేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే వాళ్లు మాకు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇస్తారని అంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ సారి ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి. మాదే పైచేయి. అయినా ఈ విషయం అందరికీ తెలిసిందే. వేగంగా పని చేయడం మా ప్రభుత్వ నైపుణ్యం. ఇది ఉన్నప్పుడు ఏమైనా సాధించొచ్చు అన్న నమ్మకం ఉంది " 


- ప్రధాని నరేంద్ర మోదీ


ప్రతిపక్షాల మాట ఇలా ఉంది..


ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. మరో మూడు విడతల్లో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనుంది. జూన్‌ 4వ తేదీన ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ రోజు కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని అంటోంది బీజేపీ. అటు ప్రతిపక్షాలు మాత్రం బీజేపీకి మెజార్టీ రావడం కష్టమే అని ప్రచారం చేస్తున్నాయి. "మోదీ వేవ్ నాకెక్కడా కనిపించడం లేదే" అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా బీజేపీ మూడోసారి గెలవడం సాధ్యం కాదంటూ జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ తాము మెజార్టీ సాధించి తీరతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే...ఉత్తరాదిలో బీజేపీకి బలం ఉన్నప్పటికీ దక్షిణాదిలో మాత్రం ఇంకా బలపడాల్సి ఉంది. బీజేపీ పెట్టుకున్న 400 లక్ష్యం నెరవేరాలంటే సౌత్‌లోనూ భారీగా ఓట్లు పోల్‌ అవ్వాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో కలిపి మొత్తం 130 ఎంపీ స్థానాలున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇందులో 29 సీట్లు సాధించింది బీజేపీ. అందులో 25 కర్ణాటక నుంచి కాగా...మిగతావి తెలంగాణలోవి. కేరళ, తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో ఖాతా కూడా తెరవలేకపోయింది. 


ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై ధీమా..


ఇక మొత్తం సీట్ల విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకుంది బీజేపీ. ఇప్పుడు 370 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. NDA కూటమితో కలిసి మొత్తంగా 400 స్థానాల్లో విజయకేతనం ఎగరేస్తామని అంటోంది. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని తేల్చి చెబుతోంది. ఇటీవలే అమిత్ షా కూడా ఇదే విషయం వెల్లడించారు. 


Also Read: Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేపీ ఆఫీస్‌కి బయల్దేరిన కేజ్రీవాల్