Visakha Police Arrested Accused In Human Trafficking: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించారని.. దాదాపు 5 వేల మంది యువత వివిధ దేశాల్లో వీరి చేతిలో ఉన్నారని నిర్ధారించినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు ఫెడెక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో అమాయకులను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగుల నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేసి వీరిని కంబోడియాకు అక్రమ రవాణా చేస్తారని.. అక్కడి ఏజెంట్ కు రూ.80 వేలు ఇస్తారని.. మిగిలినది వీరు తీసుకుంటారని వివరించారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని సీపీ తెలిపారు.


మాట వినకుంటే చిత్రహింసలు


కంబోడియాకు వెళ్లిన వారు ఒత్తిళ్లకు లొంగి స్కామ్ లు చేసే వారికి 600 డాలర్లు ఇస్తారని.. మాట వినకుంటే వారిని చిత్రహింసలు పెడతారని సీపీ చెప్పారు. ఈ ముఠా ఆగడాలు రెండేళ్లుగా సాగుతున్నాయని.. ఇప్పటికే కేసు గురించి కంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, తుని, పలాస, కలకత్తా నుంచి నిరుద్యోగ యువత వీరి ఉచ్చులో చిక్కుకున్నారని చెప్పారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలించిన యువత అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తునకు కంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటామని వివరించారు. ఈ ముఠా వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read: Tirupati News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం - తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం