AAP Protests in Delhi: స్వాతి మలివాల్‌ కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ అరెస్ట్‌పై ఆప్ నేతలు మండి పడుతున్నారు. బీజేపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ తీరుని నిరసిస్తూ ఆ పార్టీ హెడ్‌క్వార్టర్స్‌కి తమ నేతలందరితో కలిసి వెళ్తామని తేల్చిచెప్పారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోమంటూ Jail Bharo కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఆప్ కార్యకర్తలంతా ఢిల్లీలో పలు చోట్ల భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమి గూడారు. కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు మోదీ సర్కార్‌పై కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ మండి పడ్డారు. బీజేపీ ఆఫీస్ వద్ద అరగంట పాటు ఎదురు చూస్తామని, అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. అరెస్ట్ చేయలేకపోతే బీజేపీ ఓడిపోయినట్టే అని స్పష్టం చేశారు. ఆప్‌ నేతలతో పాటు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి బయల్దేరిన కేజ్రీవాల్‌ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. DDU మార్గ్‌లో 144 సెక్షన్ అమలు చేశారు. అటు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 






బీజేపీ ఆపరేషన్ ఝాడూ (Operaton Jhaadu) మొదలు పెట్టిందని, ఆప్‌ని టార్గెట్‌ చేసిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ నేతల్ని వరుస పెట్టి జైలుకి పంపిస్తోందని, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందని మండి పడ్డారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని అణిచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. పార్టీ బ్యాంక్ అకౌంట్స్‌ని నిలిపివేసేందుకూ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. త్వరలోనే ఆప్ ఆఫీస్‌లనూ మూసేయాలనీ చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేస్తే తమకు సింపథీ వస్తుందని భావిస్తున్న బీజేపీ ఎన్నికలు పూర్తయ్యాకే ఆ పని చేయాలని చూస్తోందని మండి పడ్డారు. తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి బీజేపీ ఆప్‌ని ఎలాగైనా భూస్థాపితం చేయాలన్న కక్షతో పని చేస్తోందని విమర్శించారు. 






Also Read: Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?