PM Modi in Ukraine: ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌కి చేరుకున్నారు. ప్రత్యేక దేశంగా అవతరించాక ఉక్రెయిన్‌ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. పోలాండ్ నుంచి రైల్‌లో బయల్దేరిన ఆయన ఆ దేశ రాజధాని కీవ్‌కి వెళ్లారు. ఓ రోజంతా అక్కడే పర్యటించనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కీలక చర్చలు జరిపేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం కీలకంగా మారింది. పైగా యుద్ధమే సమాధానం కాదని, శాంతియుతంగా చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవాలని గతంలో చాలా సార్లు మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మోదీకి అంతర్జాతీయంగా మద్దతు వచ్చింది. ఇది యుద్ధాల కాలం కాదని మోదీ చేసిన కామెంట్స్‌ని పలు దేశాధినేతలు ప్రశంసించారు. ఇప్పుడు స్వయంగా ఆయనే ఇక్కడ పర్యటిస్తుండడం వల్ల అంతర్జాతీయ దృష్టి నెలకొంది. ఈ పర్యటనకు ముందే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటన చరిత్రాత్మకంగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు. గతేడాది ఢిల్లీలో జరిగిన G7 సదస్సులో మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఆ చర్చలను ఇప్పుడు కొనసాగిస్తారని జైశంకర్ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ముందు నుంచీ ఏ వైపూ మద్దతునివ్వడం లేదు. యుద్ధం సరికాదని చెబుతూనే ఉన్నా అటు రష్యాకి దూరం కాలేదు. అందుకే ఈ విషయంలో భారత్ పెద్దన్న పాత్ర పోషించే అవకాశముంది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయ్నతిస్తోంది. దాదాపు 7 గంటల పాటు ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని..ఇదే విషయంపై ఫోకస్ పెట్టనున్నారు. ఉక్రెయిన్ నేషనల్ ఫ్లాగ్ డే రోజే ఆయన పర్యటిస్తుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఎప్పటి నుంచో ఓ వాదన నడుస్తోంది. అమెరికా సహా పశ్చిమ దేశాలూ ఇదే కోరుకున్నాయి. పైగా ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ కావడం, అక్కడ ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం జెలెన్‌స్కీకి మింగుడు పడలేదు. భారత్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక సమయంలో మోదీ అక్కడ పర్యటిస్తుండడం కీలకంగా మారింది.
Also Read: Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం, 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్ నదిలో బోల్తా - 14 మంది మృతి?