Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. తనహున్ జిల్లాలో మర్‌స్యాంగ్‌డీ నదిలో బస్ పడిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బస్‌..భారత్‌కి చెందిందే అని ప్రయాణికులంతా భారతీయులే అని తెలిపింది. ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం  UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్‌ ప్రమాదానికి గురైంది. యూపీకి చెందిన బస్‌గా గుర్తించారు. అయితే..అందులో ఉత్తరప్రదేశ్‌కి చెందిన వాళ్లు ఎంత మంది ఉన్నారన్నది వివరాలు తెలియలేదు. ఖాట్మండు నుంచి పొఖారా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యూపీ అధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. 45 మంది పోలీసులతో కూడిన బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పొఖారాలోని మఝేరి రిసార్ట్‌లో బస చేసిన ప్రయాణికులు ఖాట్మండ్‌కి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. 






ఈ ఏడాది జులైలోనూ నేపాల్‌లో ఇదే తరహా ఘోర ప్రమాదం జరిగింది. త్రిశూలి నదిలో రెండు బస్‌లు పడిపోయాయి. ప్రమాద సమయంలో మొత్తం 65 మంది ప్రయాణికులున్నారు. నేపాల్‌లో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 మంది గాయపడ్డారు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.