Jansuraj Padyatra: 3,500 కిమీ పాదయాత్ర ప్రారంభించిన పీకే- జనాలు లేక నిరాశ!

ABP Desam   |  Murali Krishna   |  03 Oct 2022 01:22 PM (IST)

Jansuraj Padyatra: 'జన్ సూరజ్' పేరుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర ప్రారంభించారు.

(Image Source: PTI)

Jansuraj Padyatra: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. 'జన్ సూరజ్' పేరుతో మొదలుపెట్టిన ఈ యాత్ర సుమారు 3,500 కిమీ మేర సాగనుంది. అయితే ఈ యాత్రకు ప్రజా స్పందన అంతంతమాత్రంగానే ఉండటంతో తొలి రోజే పీకేకు నిరాశ కలిగింది.

చంపారన్‌లో

గాంధీ జయంతి సందర్భంగా బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రను ప్రారంభించారు. మహాత్మా గాంధీ 1917లో మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భీతిహర్వా గాంధీ ఆశ్రమ్‌ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. అయితే ఈ యాత్ర పూర్తికావడానికి సుమారు 12 నుంచి 15 నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదే లక్ష్యం

ఈ యాత్ర ద్వారా బిహార్‌లోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌లో పర్యటించాలని ప్రశాంత్‌ కిశోర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు పీకే ఓ ట్వీట్ చేశారు.

అత్యంత పేద, బలహీన రాష్ట్రంగా ఉన్న బిహార్‌ రూపురేఖలను మార్చాలని నిశ్చయించుకున్నాను. సమాజంలో మార్పు తీసుకురావడంలో భాగంగా ఈ పాదయాత్రతో తొలి అడుగు వేస్తున్నాను. క్షేత్రస్థాయిలో సరైన పౌరులను గుర్తించి, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం కూడా 'జన్‌ సూరజ్‌' ధ్యేయం.                                                             - ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

నిరాశ

పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ టీమ్‌కు తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారన్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది.

రాజకీయాలపై

పీకే.. అప్పుడప్పుడూ ట్విట్టర్‌ వేదికగా పలువురు రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తుంటారు. 2021 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి పాత్రపై ఇటీవల పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని పీకే అభిప్రాయపడ్డారు.

విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడలేం. ఇలాంటి సమావేశాలు, చర్చలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితుల్ని మార్చవు. నాకు ఎక్కువ అనుభవం లేదు. ఆయన(నితీశ్) నాకంటే అనుభవజ్ఞుడు. కానీ.. కొందరు నేతలు భేటీ కావడాన్ని, కలిసి ప్రెస్ మీట్​లు నిర్వహించడాన్ని నేను 'విపక్షాల ఐక్యత'లా లేదా 'రాజకీయంగా సరికొత్త పరిణామం'గా చూడడం లేదు. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి తీసుకొచ్చి, వారిలో ఓ బలమైన అభిప్రాయం కలిగేలా చేసి, భాజపాకు మెరుగైన ప్రత్యామ్నాయం అని జనానికి నమ్మకం కలిగించే విశ్వసనీయ వ్యక్తిని కూటమికి సారథిగా నిలబెడితే తప్ప.. ప్రజలు విపక్ష కూటమికి ఓట్లు వేయరు                                                         " -       ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

Also Read: Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!

Also Read: Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'

Published at: 03 Oct 2022 01:07 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.