Dog Bites Kid in Lift:


చేయి కొరికిన శునకం..


నోయిడాలో శునకాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పెంపుడు జంతువులు యజమానులకు అధికారులు ఎన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తున్నా...అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లిఫ్ట్‌లో కుక్కల్ని తీసుకొచ్చేప్పుడు వాటి మూతి కట్టేయాలని సూచించారు. అయినా...కొందరు పట్టించుకోవటం లేదు. ఫలితంగానే...మరోసారి ఓ బాలుడు కుక్క కాటుకు గురయ్యాడు. గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ఓ బాలుడిని కుక్క కరిచింది. తల్లిచాటుగా నిలబడి ఉన్న పిల్లాడి చేయిని కొరికింది. యజమాని వెంటనే దాన్ని వెనక్కి లాగాక గానీ...అది ఊరుకోలేదు. ఈ దాడిలో బాలుడి చేతికి గాయాలయ్యాయి. 






నోయిడాలో కొత్త రూల్స్..


యూపీలోని నోయిడాలో కుక్కలు పెంచుకునే వాళ్లంతా ఇప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలంటోంది ప్రభుత్వం. ఇటీవలే నోయిడా అధికారులు భేటీ అయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుక్కలు, పిల్లులు పెంచుకునే వారికి షాక్ ఇచ్చారు. పెంపుడు జంతువుల కారణంగా ఎలాంటి ప్రమాదం జరిగినా...యజమానులకు భారీగా జరిమానాలు విధించాలని అధికారులు నిర్ణయించారు. రూ.10 వేల జరిమానాతో పాటు బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చునీ యజమానులే భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో వాళ్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకుపెంపుడు కుక్క ఓ వ్యక్తిని కరిస్తే...ఆ వ్యక్తి వైద్యానికి ఎంత ఖర్చవుతుందో అదంతా యజమాని తన జేబులో నుంచి పెట్టుకోవాలి. వీటితో పాటు మరి కొన్ని నిర్ణయాలూ తీసుకున్నారు. పెంపుడు పిల్లులు, కుక్కలను కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. ఇలా రిజిస్టర్ చేయించుకోకపోతే...జరిమానా విధిస్తారు. వాటికి తప్పనిసరిగా వ్యాక్సిన్‌లు వేయించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా జరిమానా తప్పదు. అంతే కాదు. పెంపుడు జంతువులు బయటకు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేస్తే...యజమానులే ఆ ప్రాంతాన్ని 
శుభ్రం చేయాల్సి ఉంటుంది. నోయిడా అథారిటీ సీఈవో ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ కండిషన్స్‌ అన్నీ వరుసగా ట్వీట్‌లు చేశారు. బోర్డ్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.


Animal Welfare Board of India సూచనల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ మధ్య కుక్కలు.. మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కానీ తాజాగా పెంపుడు కుక్క క‌రిచిన 
కేసులో ఓ మ‌హిళా బాధితురాలికి రూ. 2 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గురుగ్రామ్‌లో ఉన్న సివిల్ లైన్ పోలీస్ స్టేష‌న్‌లో ఘటనపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయింది. ఈ ఘటనపై గురుగ్రామ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు జిల్లా వినియోగ‌దారుల ఫోర‌మ్ కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 


Also Read: Shraddha Walkar Murder Case: వెబ్‌ సిరీస్ చూసి ఆధారాలు మాయం చేసిన అఫ్తాబ్- మామూలోడు కాదు!