జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీ చేరుకుని మొదటగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారని ఆ ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని జనసేన వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. ప్రహ్లాద్ జోషి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ ముఖ్య నేతలతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని ప్రెస్‌నోట్ విడుదల చేశారు కానీ..ఆ ముఖ్య నేతలెవరో స్పష్టత లేదు. [tw]
[/tw]
పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో వివిధ రకాల చర్చల నిమిత్తం రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన గురించి బీజేపీ పట్టించుకోలేదు. హఠాత్తుగా ప్రహ్లాద్ జోషి పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీ-జనసేన మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. రెండు వారాల కిందట సమావేశం పెట్టుకుని కలసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా.. ఎవరి పోరాటాలు వారు చేస్తున్నారు. రూపు మారిన రోడ్లపై జనసేన సొంతంగా డిజిటల్ ఉద్యమం చేపట్టింది. బీజేపీ వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ సొంతంగా కార్యక్రమాలు చేపడుతోంది. ఎక్కడా రెండు పార్టీలు కలిసి రాజకీయ పయనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. Also Read : ఒక్కో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత తీసుకుంటారో తెలుసా..?
అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. కొంత మంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా జనసేన వర్గాలు గతంలో ఆఫ్ ది రికార్డు చెప్పాయి. ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేతలకు అంతకగా సరిపడటం లేదు. విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేష్ బీజేపీతో పొత్తు వల్ల జనసేన తీవ్రంగా నష్టపోతోందని పలుమార్లు నేరుగా మీడియాతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. Also Read : ఏపీలో ముదిరిన వినాయక చవితి ఆంక్షల వివాదం
అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణంతో పిలిచారో జనసేన స్పష్టత ఇవ్వలేదు. అలాగే బీజేపీ తరపున ఏ ముఖ్య నేతల్ని కలిశారో కూడా జనసేన చెప్పలేదు. మోడీ, అమిత్ షా , నడ్డా లాంటి పెద్ద నేతలతో భేటీ అయితే ఫోటోలతో సహా చెప్పేవారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.