Patra Chawl Scam Case: మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఊరట లభించలేదు. ఆ కేసులో మరో 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.


కీలక ఆదేశాలు


పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ముంబయిలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దీంతో మరో 14 రోజుల పాటు ఆయన జైలులో గడపనున్నారు. అయితే తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్‌ రౌత్‌ కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది కోర్టు. పీఎమ్‌ఎల్‌ఏ కేసులో ఆగస్టు 1న సంజయ్‌ రౌత్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది.


నమ్మకం ఉంది



న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. సంజయ్‌ రౌత్‌కు ఆగస్టు 22 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బాల్‌ఠాక్రే ఆశయాలను ఆచరించే నిజమైన శివసైనికుడు సంజయ్ రౌత్. ఆయన ఎప్పుడూ అవినీతి చేయరు. భాజపా ఆయన్ను చూసి భయపడుతోంది.                                                                           "
- సునీల్ రౌత్, సంజయ్ రౌత్ సోదరుడు



ఇదీ జరిగింది


దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఆగస్టు 1 అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.


ఠాక్రే వార్నింగ్


మోదీ నేతృత్వంలోని కేంద్రానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'పుష్ప' సినిమాలో డైలాగ్ చెప్పారు ఠాక్రే.


సంజయ్‌ రౌత్‌ను చూసి గర్వపడుతున్నాను. పుష్ప సినిమాలో 'ఝూకేంగా నహీ' (తగ్గేదేలే) అని ఓ డైలాగ్ ఉంటుంది. అయితే వెనక్కి తగ్గని నిజమైన శివసైనికుడు సంజయ్ రౌత్. భాజపా ప్రలోభాలకు లొంగను అని చెప్పిన చాలా మంది ఇప్పుడు వారి వర్గంలో చేరారు. ఇది కాదు బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది. రౌత్ నిజమైన శివ సైనికుడు.  రౌత్‌ను అరెస్ట్ చేసి భాజపా విర్రవీగుతోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం.                                                   "


-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధినేత