Opposition MPs Suspension in Parliament: పార్లమెంట్ (Parliament) లో విపక్షాల నిరసనలతో గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్ సభలో (Loksabha) ఆగంతుకుల చొరబాటుకు సంబంధించి భద్రతా వైఫల్యంపై హోం మంత్రి (Home Minister) ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ (Speaker) విపక్ష ఎంపీలపై వేటు వేశారు. ఈ మేరకు సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్ సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూఖ్ అబ్దుల్లా, శశిథరూర్, మనీశ్ తివారీ, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, డానిష్ అలీ సస్పెండైన వారిలో ఉన్నారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. 


ఉభయ సభలు వాయిదా


విపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. లోక్ సభలో భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, విపక్ష ఎంపీలపై  సస్పెన్షన్ సైతం ఎత్తేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ వెల్ లోకి వెళ్లి మరీ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అటు, సస్పెన్షన్ కు గురైన ఎంపీలు అడిగిన 27 ప్రశ్నలను లోక్ సభ ప్రశ్నల జాబితా నుంచి తొలగించారు.


మొత్తం 141 మందిపై


కాగా, లోక్ సభలో గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకూ లోక్ సభలో 95 మంది ఎంపీలపై వేటు పడింది. అటు, రాజ్యసభలోనూ ఇప్పటివరకూ 46 మంది సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై వేటు పడినట్లైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 (శుక్రవారం)తో ముగియనున్నాయి.


ఇదీ జరిగింది


ఈ నెల 13న గుర్తు తెలియని వ్యక్తి లోక్ సభలో ప్రవేశించి హల్ చల్ చేశాడు. గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలాడు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో భయంతో ఎంపీలు పరుగులు పెట్టారు. ఆ రోజు స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. జీరో అవర్ లో ఈ ఘటన జరగ్గా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు ఆగంతుకులను పట్టుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, ఘటనకు సంబంధించి పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో దాడి తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో విపక్ష సభ్యులు పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఆందోళన కొనసాగించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు చేపడుతూ స్పీకర్, చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.


Also Read: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు - మసీదు కమిటీ పిటిషన్లు కొట్టేసిన న్యాయస్థానం