Parliament Winter session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. సమావేశాలను సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని, కొత్త ఎంపీల బాధను అర్థం చేసుకోవాలని మోదీ కోరారు.
మొదటి సారి ఎంపీలు, కొత్త ఎంపీలు, యువ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వాలి. ఇది వారి ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఫ్లోర్ లీడర్‌లను నేను కోరుతున్నాను. గత కొద్దిరోజులుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను నేను అనధికారికంగా కలిసినప్పుడు.. సభలో గందరగోళం జరిగితే అది ఎంపీలపై ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. సభ సజావుగా జరగనప్పుడు వారికి నేర్చుకునే అవకాశం దొరకదు. అందుకే సభ సజావుగా నిర్వహించడం అత్యంత కీలకం. ముఖ్యంగా యువ ఎంపీలు ఇదే కోరుకుంటారు. ప్రతిపక్ష ఎంపీలు కూడా చర్చల్లో మాట్లాడలేక పోతున్నామని, సభ వాయిదా పడిందని, నష్టపోతున్నామని చెప్పారు. ఈ యువ ఎంపీల బాధను ఫ్లోర్ లీడర్‌లు, పార్టీ నేతలు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. - ప్రధాని నరేంద్ర మోదీ
జీ20పై
జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు రావటం శుభపరిణామమని మోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు.
శీతాకాల సమావేశాల తొలి రోజు ఇది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నాం. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం. గ్లోబల్ కమ్యూనిటీలో భారత్ స్థానం సంపాదించిన తీరు, మనపై ఉన్న అంచనాలు, అంతర్జాతీయ సమాజంలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం జీ20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: MCD Election Results: దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్- ఆప్, భాజపా మధ్య హోరాహోరీ!