Budget Session 2023:
66 రోజుల పాటు సమావేశాలు..
పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీన మొదలై..ఏప్రిల్ 6న ముగియనున్నాయి. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. దాదాపు 66 రోజుల పాటు 27 సార్లు సమావేశం కానున్నట్టు తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. ఆ తరవాత లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశిస్తూ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి ప్రసంగించనున్నారు.
"అమృత్ మహోత్సవాల సందర్భంగా తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ఏం మాట్లాడతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కేంద్ర బడ్జెట్‌తో పాటు మరి కొన్ని అంశాలపై ఆమె ప్రసంగించనున్నారు"
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
మధ్యలో బ్రేక్..
66 రోజుల సమావేశాల్లో మధ్యలో కొన్ని రోజులు విరామం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకూ బ్రేక్ తీసుకుంటారు. ఈ గ్యాప్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు మంత్రుల డిమాండ్‌లను పరిశీలించి వాటి ఆధారంగా రిపోర్ట్‌లు రూపొందిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి "ధన్యవాదాల తీర్మానం" ప్రవేశపెట్టాక బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడతారు. ఆ తరవాత యూనియన్ బడ్జెట్‌పై ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతారు. ఇప్పటికే మంత్రులు కొన్ని డిమాండ్‌లను కేంద్రం ముందుంచారు. వీటిని మోడీ సర్కార్ పరిశీలిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వీటిపైనే దృష్టిసారించే
అవకాశాలున్నాయి.
నీతి ఆయోగ్‌తో భేటీ..
కేంద్రం బడ్జెట్ సమావేశాలకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం జరిగింది. అభిప్రాయాలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలోఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే. అందుకే...ఇంకాస్త ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నారు ప్రధాని. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. నీతి ఆయోగ్‌తో పూర్తి స్థాయిలో చర్చించాక బడ్జెట్‌ను రూపొందిస్తారు. బడ్జెట్‌కు ఒక రోజు ముందు అంటే జనవరి 31న పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.దేశ వార్షిక ఆర్థిక ప్రగతిని ఆర్థిక సర్వే ప్రతిబింబిస్తుంది. ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి సమాధానాలను అన్వేషిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ ఆర్థిక సర్వేను రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి, రాబడి, ఖర్చులతో కూడిన సమగ్ర ఆర్థిక పత్రమే కేంద్ర బడ్జెట్. ఫ్రెంచ్ పదం బుగెట్టి నుంచి బడ్జెట్ ఆవిర్భవించింది. సంచి అని దీనర్థం. భవిష్యత్తులో రాబడి, ఖర్చుల అంచనాలను బట్టి బడ్జెట్‌ను రూపొందిస్తారు.