MV Ganga Vilas Launch:


ప్రారంభించిన ప్రధాని 


ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూజ్‌ (Ganga River Cruise) MV Ganga Vilasను ప్రధాని మోడీ ప్రారంభించారు. క్రూజ్ టూరిజంను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ క్రూజ్‌ను అందుబాటులోకి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోడీ...ఆ తరవాత ప్రసంగించారు. హరహర మహాదేవ్ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. "ప్రపంచంలోనే అతి పొడవైన క్రూజ్‌ను గంగా నదీ తీరం నుంచి ప్రారంభించడం చరిత్రాత్మక ఘటన. దేశ పర్యాటక రంగంలో ఇదో నూతన అధ్యాయం" అని స్పష్టం చేశారు. ఆ తరవాత రూ. 1000 కోట్ల విలువైన మరి కొన్ని వాటర్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అత్యంత కీలకమైన "టెంట్ సిటీ" (Tent City)ని ప్రారంభించారు. గంగానదీ తీరంలో ఏర్పాటు చేయనున్నారు. ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకూ ఈ టెంట్‌ సిటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో వర్షాలు బాగా కురవడం వల్ల నీటి మట్టం పెరుగుతుంది. అందుకే...ప్రజలకు ఇబ్బందులు రాకుండా దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ టెంట్‌లలో భక్తులు ఆశ్రయం పొందడానికి వీలుంటుంది. పడవల ద్వారా ఈ టెంట్‌సిటీకి చేరుకోవచ్చు. 














గంగా విలాస్ ప్రత్యేకతలివే..


MV గంగా విలాస్ వారణాసి నుంచి మొదలై మొత్తం 3,200 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. 51  రోజుల పాటు ఈ జర్నీ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని డిబ్రుగర్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో మొత్తంగా రెండు దేశాల్లో కలిపి 27 నదుల్లో ప్రయాణం సాగుతుంది. 2018 నుంచే బీజేపీ ఈ క్రూజ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. 2020లోనే రావాల్సి ఉన్నా...కరోనా కారణంగా జాప్యమైంది. ఈ క్రూజ్‌లో మొత్తం 3 డెక్స్‌,18 సూట్స్  ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు అనుకూలంగా కూర్చోవచ్చు. విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అంతకు ముందు అతి పొడవైన క్రూజ్‌ను స్విట్జర్‌ల్యాండ్‌లో తయారు చేశారు. అందులో 32 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు ఆ రికార్డుని అధిగమిస్తూ...36 మంది ప్రయాణికులతో గంగా విలాస్‌ను రూపొందించారు. ప్రపంచంలోనే ది బెస్ట్ గా నిలవాలన్న ఉద్దేశంతో తయారు చేశారు. మొత్తం ప్రయాణంలో 50 టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించేలా ప్లాన్ చేశారు. నేషనల్ పార్క్‌లు, నదీ ఘాట్‌లు, 
పట్నా, కోల్‌కత్తా, ధాకా లాంటి కీలక నగరాలనూ సందర్శించే వీలుంటుంది. ఈ క్రూజ్‌లో స్పా, సెలూన్, జిమ్‌ కూడా ఉన్నాయి. రోజుకు రూ.25-50 వేల వరకూ చెల్లించాల్సిందే. అంటే మొత్తం 51 రోజులకు కలిపి ఒక్కో ప్రయాణికుడికి రూ.20 లక్షలు ఖర్చవుతుంది. 


Also Read: Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్ బస్ ఢీకొని 10 మంది మృతి