Woman Gives Birth To Six Babies: పాకిస్థాన్‌లో అరుదైన ఘటన జరిగింది. ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురుకి జన్మనిచ్చింది. రావల్‌పిండిలోని హాస్పిటల్‌లో ఏప్రిల్ 19వతేదీన ఆమె ప్రసవించింది. పాకిస్థాన్‌లోని Dawn వార్తా సంస్థ ఈ విషయం వెల్లడించింది. ఈ ఆగుగురు శిశువుల్లో నలుగురు అబ్బాయిలు కాగా ఇద్దరు అమ్మాయిలు. తల్లితో సహా చిన్నారులంతా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పురిటినొప్పులతో బాధ పడుతూ హాస్పిటల్‌కి వచ్చిన ఆ మహిళకు ప్రసవం చేయడం చాలా కష్టమైంది. ఆరుగురు శిశువులు జన్మించడం వల్ల ఆపరేషన్‌కి ఎక్కువ సమయం పట్టినట్టు వైద్యులు వివరించారు. చిన్నారులు ఎవరూ తక్కువ బరువుతో పుట్టలేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. పుట్టిన వెంటనే అందరినీ ఇంక్యుబేటర్‌పై ఉంచినట్టు తెలిపారు. ఆరుగురు శిశువులు పుట్టడం ఆ కుటుంబ సభ్యుల్నే కాదు హాస్పిటల్ సిబ్బందినీ ఆశ్చర్యపరిచింది. అంతా ఒక్కసారిగా సంబరాలు చేసుకున్నారు. వాళ్లు హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని అంటున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రతి 45 లక్షల ప్రసవాల్లో ఏ ఒక్కరికో ఇలా ఆరుగురిని ప్రసవించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో కూడా వివరించారు.
సాధారణంగా శుక్రకణాలు అండాలతో కలిసినప్పుడు పిండం ఏర్పడుతుంది. అయితే కొన్ని సార్లు ఇవి రెండు కన్నా ఎక్కువగా తయారవుతుంటాయి. అలాంటప్పుడే కవలలు పుడతారు. కొన్ని సందర్భాల్లో శుక్రకణాలతో కలిసిన అండం గర్భాశయం వరకూ వెళ్లకముందే విడిపోవడం వల్ల ఇలా ట్విన్స్‌కి జన్మనిచ్చే అవకాశముంటుంది. లేదా వేరు వేరు శుక్రకణాలు వేరువేరు అండాలతో కలిసినప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సమయంలోనే అండాలు రెండు కన్నా ఎక్కువగా విడిపోయి గర్భాశయంలోకి వెళ్తాయి. చాలా అరుదుగా అవి ఆరుగా విడిపోతుంటాయి. అప్పుడే ఇలా ఆరుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మిస్తారు. ఇది అరుదే అయినా చాలా ప్రమాదకరం కూడా. ఒక్కోసారి తల్లి ప్రాణాలు పోవచ్చు. కానీ...ఈ మధ్య కాలంలో ఇలా ఒకరి కన్నా ఎక్కువగా శిశువులు జన్మిస్తుండడం సాధారణమైపోయింది. సంతానం కలగడం కోసం మందులు వాడడం, IVF చేయించుకోవడం లాంటివి ఇందుకు కారణాలుగా చెబుతున్నారు వైద్యులు. ఫర్టిలిటీ డ్రగ్స్ వినియోగించిన సమయంలో స్త్రీలలో అండాల ఉత్పత్తి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఒకే కాన్పులో ఇద్దరు ముగ్గురు శిశువులు జన్మించేందుకు ఆస్కారముంటుంది. మొదటి సారి 1974లో సౌతాఫ్రికాలో ఓ మహిళ ఇలా ఆరుగురికి జన్మనిచ్చి రికార్డు సృష్టించింది.