Ajay Ghosh And Chandini Chowdary Starrer ‘Music Shop Murthy‘ Teaser Out: డిఫరెంట్ కంటెంట్​తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. రొటీన్​కు భిన్నంగా ఏది వచ్చినా చూస్తారు. టాలీవుడ్​లో గత కొంత కాలంగా ఇలాంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. తాజాగా అలాంటి కథాంశంతో వస్తున్న సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ బ్యూటీ చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఆకట్టుకుంటున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్


త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తిగా కనిపిస్తున్నారు. ఆయనకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. అందుకే మ్యూజిక్ షాప్ పెడతాడు. ఎంతో ఇష్టంగా రన్ చేస్తుంటాడు. ఎక్కడ ఏ వేడుక జరిగినా మూర్తి డీజే ఉండాల్సిందే. మరోవైపు అతడిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. షాప్ అమ్మేస్తే అప్పులు తీరుతాయని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తారు. “సంపాదించినవన్నీ ఆస్తులు కాదు, కొన్ని జ్ఞాపకాలు అవుతాయి. వాటిని కాపాడుకోవాలి గానీ, అమ్ముకోకూడదు అంటాడు మూర్తి. చివరకు అప్పుల బాధలు తీరక, ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే మ్యూజిక్ షాపు అమ్మేయాలని భావిస్తాడు. షాపు అమ్మి అప్పులు తీర్చుతాడు. డీజేగా మారేందుకు హైదరాబాద్ కు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. మొత్తంగా ఈ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.   



పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’


ఈ సినిమాలో అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విలన్​గా, కమెడియన్​గా అజయ్ ఘోష్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక షార్ట్ ఫిలిమ్స్​తో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న చాందినీ చౌదరి.. హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. వీరిద్దరు కలిసి ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సీనియర్ నటి ఆమని ఈ చిత్రంలో అజయ్ ఘోష్ భార్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస్ బెజుగమ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.   


Read Also: ‘గామి‘ సినిమాలో ఒక్కో సీన్ వెనుక ఇంత కథ ఉందా? డైరెక్టర్ క్రియేటివిటీ మరో లెవెల్ అంతే!