Mango Coconut Chuteny Recipe : మామిడికాయల సీజన్​లో వాటిని ఏదొకరకంగా మన డైట్​లో నింపుకోవాలని చూస్తాం. పైగా మామిడి రుచిని అన్ని రకాలుగా ఆస్వాదించాలంటే రాసి పెట్టి ఉండాలి. దానిలోని పోషకాలు, మినరల్స్ పొందేందుకు వాటితో వివిధ వంటలు చేస్తూ ఉంటాము. అలాంటి వాటిలో మామిడి కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. దీనిని ఇడ్లీలు, దోశలు, వివిధ బ్రేక్​ఫాస్ట్​లకు బెస్ట్ కాంబినేషన్​గా వాడుకోవచ్చు. మరి దీనిని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.  


కావాల్సిన పదార్థాలు


తాజా కొబ్బరి - ఒకటిన్నర కప్పు


మామిడి కాయ - చిన్నది లేదా (అరకప్పు)


పచ్చిమిర్చి - 8


జీలకర్ర - అర టేబుల్ స్పూన్ 


ఉప్పు - రుచికి తగినంత 


వెల్లుల్లి - 7 రెబ్బలు 


వేరుశెనగ - 2 టేబుల్ స్పూన్లు


కొత్తిమీర  - చిన్న కట్ట 


తాళింపు కోసం 


నూనె - 2 టేబుల్ స్పూన్లు


ఆవాలు - 1 అర టీ స్పూన్


పచ్చి శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్ 


మినపప్పు - 1 టేబుల్ స్పూన్ 


ఇంగువ - చిటికెడు 


అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్ 


ఎండుమిర్చి - 2


పసుపు - అర టేబుల్ స్పూన్


కరివేపాకు - రెండు రెమ్మలు 


తయారీ విధానం


ముందుగా మామిడి కాయను తీసుకోవాలి. మామిడి పుల్లగా ఉంటే చట్నీ రుచి అదిరిపోతుంది. దీనిని కడిగి ముదురు మామిడి అయితే పైన తొక్కను చెక్కాలి. లేత మామిడి అయితే తొక్కతో సహా వేసుకోవచ్చు. ఈ మామిడి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం మామిడి వేయాల్సిన అవసరం లేదు. అరకప్పు వేస్తే సరిపోతుంది. చట్నీ చేసిన తర్వాత పులుపు సరిపోలేదు అనుకుంటే మామిడి తురుము వేసినా సరిపోతుంది. ముందే చట్నీలో పులుపు ఎక్కువైతే తినలేమని గుర్తించుకోండి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా తురుమి సిద్ధం చేసుకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి.. దానిలో పల్లీలు వేయాలి. వాటిని డ్రై రోస్ట్ చేయాలి. అవి మంచి గోధుమ రంగులో వచ్చిన తర్వాత స్టౌవ్ ఆపేసి చల్లార్చనిచ్చి పొట్టు తీసేయాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్​లోకి తీసుకుని.. పచ్చిమిర్చిని ముక్కలుగా విరిచి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ప్లేస్​లో ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. కానీ వాటిని వేసుకోవాలనుకుంటే వేయించాలని గుర్తించుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, రాళ్ల ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటిని కాస్త మెత్తగా రుబ్బుకుంటే మంచిది. దానిలో కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసి.. కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలతో మామిడి ముక్కలు కూడా వేసేయొచ్చు కదా అనుకుంటున్నారా? అలా వేస్తే కొబ్బరి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కువ సేపు గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఆలోపు మామిడి పూర్తిగా గ్రైండ్ అయిపోతుంది. ఈ పచ్చడి కోసం.. మనం మామిడిని కాస్త బరకగా చేసుకుంటే నోటికి మామిడి తగిలినప్పుడు రుచి రెట్టింపు అవుతుంది. 


కొబ్బరిని బరకగా రుబ్బుకున్న తర్వాత.. దానిలో మామిడిముక్కలు వేసుకోవాలి. దీనిని కూడా మిక్స్ చేసుకోవాలి. కాస్త బరకగా ఉంటే రుచి బాగుంటుంది కాబట్టి.. 90 శాతం మెత్తగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి.. ఆవాలు వేసి వేయించుకోవాలి. దానిలో పచ్చిశెనగపప్పు, మినపప్పు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయితే చట్నీలో అవి తగిలినప్పుడు క్రంచీగా వస్తుంది. దానిలో ఎండుమిర్చి వేసి తాళింపు రంగు మారుతున్నప్పుడు జీలకర్ర, ఇంగువ, అల్లం తురుము వేసి వేయించుకోవాలి. చివర్లో కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు ముందే వేస్తే తాళింపు మాడిపోతుంది. కాబట్టి చివర్లోనే వేసుకోవాలి. ఈ తాళింపును చట్నీలో వేసుకుని కలిపేయాలి. అంతే టేస్టీ పచ్చడి రెడీ. 



మామిడికాయ కొబ్బరి పచ్చడిని.. ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. దీనిలో పల్లీలు వేయడం వల్ల చట్నీ నీరు కారదు. పైగా టేస్ట్​ కూడా రెట్టింపు అవుతుంది. చట్నీలో పులుపు సరిపోకపోతే ముందుగా చెప్పినట్లు దాంట్లో కొబ్బరి తురుమును వేసుకోవచ్చు. చట్నీగా చేసుకున్న దానిని రైస్​లో కూడా కలిపి తినొచ్చు. సీజన్​లలో దొరికే పండ్లు, కూరగాయలను.. రెగ్యూలర్​ డైట్​లో చేర్చుకోవాలనుకుంటే ఇలాంటి రెసిపీలను ఫాలో అయిపోవడమే. 


Also Read : మామిడికాయ పులిహోర.. ఈ రెసిపీలో ఆ టిప్స్​ ఫాలో అయితే టేస్ట్ అదిరిపోతుంది