Mamidikaya Pulihora Recipe : వేసవిలో మామిడిపండ్లతో పాటు.. మామిడి కాయలను కూడా వివిధ రూపాల్లో తీసుకుంటారు. అలాంటివాటిలో మామిడి కాయ పులిహోర ఒకటి. సమ్మర్ స్పెషల్ ఫుడ్స్​లో ఇది కచ్చితంగా ఉంటుంది. పులిహోరను చాలామంది ఇష్టంగా తింటారు. అలాంటి పులిహోరను మామిడికాయతో చేస్తే అబ్బో దానిని రుచిని వివరించడం సాధ్యం కాదు. దీనిని మీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. పండుగల సమయంలో కూడా దీనిని వండుకోవచ్చు. బ్రేక్​ఫాస్ట్​, లంచ్​గా కూడా దీనిని చాలామంది వండుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ మామిడికాయ పులిహోరను ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే రెసిపీ టేస్టీగా వస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


పచ్చిమిర్చి - 10


ఎండు మిర్చి - 5


కరివేపాకు - 2 రెబ్బలు


పల్లీలు - 100 గ్రాములు


మినపగుళ్లు - టేబుల్ స్పూన్


ఇంగువ - చిటికెడు


పసుపు - 2 టీస్పూన్స్


జీలకర్ర - అరటీస్పూన్


ఆవాలు - అరటీస్పూన్ (ఆప్షనల్)


జీడిపప్పు - 20


మామిడి కాయ - 1 పెద్దది ఒకటి


ఉప్పు - రుచికి తగినంత


బియ్యం - మూడు కప్పులు 


నూనె - 3 టేబుల్ స్పూన్స్


తయారీ విధానం


బియ్యం అనేది కచ్చితంగా మీ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఎంతమందికి పులిహోర తినిపించాలనుకుంటే దానికి తగ్గట్లు బియ్యం వేసుకోవడంతో పాటు కొలతలు మారుతాయి. ముందుగా బియ్యాన్ని కడిగి అన్నాన్ని వండుకోండి. అన్నాన్ని ఎలా వండాలో అందరికీ తెలుసు. అయితే కొందరు ముద్దగా వండుకుంటారు. పులిహోరకి అన్నం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. పులిహోర మిక్స్ సరిగ్గా కలిసే అవకాశముండదు. కాబట్టి అన్నం విషయంలో ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. 


మామిడికాయను బాగా కడిగి.. పైన తొక్క తీసివేయాలి. ఇప్పుడు దానిని తురిమి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కట్ చేసి.. మిగిలిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించింది. దానిపై కడాయి పెట్టుకోండి. దానిలో నూనె వేసుకోవాలి. అది వేగుతున్నప్పుడు దానిలో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతున్న సమయంలో మినపగుళ్లు వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు పల్లీలు వేసుకోవాలి. వాటిని బాగా వేపుకోవాలి. పల్లీలు పూర్తిగా వేగిపోతున్న సమయంలో జీడిపప్పు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 


పచ్చిమిర్చిలోని నీరు పోయేవరకు వేయించుకుని దానిలో కరివేపాకు వేసుకోవాలి. అనంతరం పసుపు, ఇంగువ వేసుకుని బాగా కలపాలి. ఇంగువ వేసుకుంటే పులిహోర రుచి రెట్టింపు అవుతుంది. అన్ని బాగా కలిపిన తర్వాత దానిలో మామిడి తురము వేయాలి. తాళింపులో మామిడి కలిసేలా బాగా కలపాలి. అది ఉడుకుతున్న సమయంలో ఉప్పు కూడా వేసుకోవాలి. అడుగు పట్టకుండా మామిడి తురుమును కలుపుతూ ఉండాలి. మామిడి ఉడికి.. నూనె పైకి వస్తుందంటే తాళింపు రెడీ అయిపోయినట్లు అర్థం. 


ఇప్పుడు మీరు ఈ మామిడి పులిహోర తాళింపులో రైస్ వేసి కలుపుకోవచ్చు. కొందరు రైస్​ గిన్నెలోనే తాళింపు వేసి కలుపుకుంటారు. ఎక్కువగా రైస్ ఉన్నప్పుడు ఇలా చేయవచ్చు కానీ.. ఇంటిల్లిపాదికి చేసుకున్నప్పుడు తాళింపు కడాయిలోనే రైస్ వేసి కలిపితే అది వేడిగా ఉంటుంది. మీ కొలతను బట్టి తాళింపును కలుపుకోవచ్చు. తాళింపు ఎక్కువ చేసుకుని రైస్ తక్కువగా ఉంటే.. ఈ మిక్స్​ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు కలుపుకుని తినొచ్చు. ఇది 15 రోజులవరకు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ మామిడి కాయ సీజన్​లో మీరు కూడా ఈ పులిహోరను ట్రై చేసి.. ఇంటిల్లిపాదికీ పెట్టేయొచ్చు. 


Also Read : మూడు నెలలు నిల్వ ఉండే టేస్టీ మామిడి పచ్చడి.. 5 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు