Pakistan New Army Chief:
ఆర్మీచీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ అసీమ్ మునీర్..
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్...కొత్త ఆర్మీ చీఫ్‌ను అపాయింట్ చేశారు. Inter-Services Intelligence (ISI) మాజీ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ అసీమ్ మునీర్ కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించారు. జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో...అసీమ్ మునీర్ బాధ్యతలు తీసుకోను న్నారు. నవంబర్ 29న బజ్వా రిటైర్ అవనున్నారు. మూడేళ్ల క్రితమే రిటైర్ అవ్వాల్సి ఉన్నా..ఆయన పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు కొనసాగించారు. పాకిస్థాన్ సమాచార మంత్రి మరియం ఔరంగజేబ్ "లెఫ్ట్‌నెంట్ జనరల్ సాహిర్ శంషాద్ మిర్జాను జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమించాం" అని వెల్లడించారు. ఈ ఇద్దరి అధికారులనూ ఫోర్ స్టార్ జనరల్స్‌గా ప్రమోట్ చేశారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపాక..వీరి నియమాకం అధికారికమవుతుంది. మొత్తం ఆరుగురి పేర్లు జాబితాలో చేర్చగా...చివరకు అసీమ్ మునిర్‌కే అంతా ఓటు వేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఆయనకే మద్దతునిచ్చారు. 2018లో లెఫ్ట్‌నెంట్ జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ "టు స్టార్" జనరల్ గా ప్రమోట్ చేశారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్‌లో చేరిన ఆయన...ఆ తరవాత Frontier Force Regimentలోనూ సేవలందించారు.
సవాళ్లు..
కొత్త ఆర్మీ చీఫ్‌కి...ఆ బాధ్యతలు చేపట్టగానే సవాళ్లు ఎదురవనున్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరగటంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఓ మార్చ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరగ్గా ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఇది జరిగిన మరుక్షణం నుంచే ఇమ్రాన్ వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. చూస్తుంటే...పాక్‌లో మరోసారి పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధానికీ దారి తీయొచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ఒత్తిడిని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎలా తట్టుకుంటుంది..? ఇమ్రాన్ వర్గీయులు ఒక్కసారిగా అల్లర్లు సృష్టిస్తే వాటిని సైన్యం ఎలా అదుపు చేస్తుంది..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగో లేదు. ఇలాంటి కష్టకాలంలో ఇమ్రాన్‌ఖాన్‌పై దాడి జరగటం అక్కడి వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఇమ్రాన్ మద్దతుదారులు దేశంలో అలజడి సృష్టిస్తే ప్రచ్ఛన్న యుద్ధమూ తప్పదు. లేదంటే...షహబాజ్ చేతులు ఎత్తేసి పూర్తి అధికారాలను సైన్యానికి అప్పగించవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా...పాకిస్థాన్ కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఈ మధ్యే FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ ఆ దేశానికి...ప్రస్తుత పరిణామాలు పెద్ద దెబ్బే అవుతుండొచ్చు. పదేపదే సైన్యాన్ని తప్పు పడుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను అణిచివేసేందుకు...షహబాజ్ ప్రభుత్వం ఆ సైన్యాన్నే అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత దాడితో ఇమ్రాన్ ఖాన్‌కు సింపథీ అయితే దక్కుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ ఇచ్చే అంశమే. మరో వారం పది రోజుల్లో పాకిస్థాన్‌లో రాజకీయాలు ఎలా మారతాయో గమనించాలి.