Islamabad Suicide Bomb: 


తనిఖీ చేస్తుండగా దాడి..


పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీస్ ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామా బాద్‌లోని I-10 సిటీలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. వాహనాల తనిఖీ చేస్తుండగా...ఓ కార్‌ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే ఆ కార్‌ను ఆపి చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో అందులోని డ్రైవర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ ఆరుగురిలో నలుగురు పోలీసులు కాగా...ఇద్దరు సాధారణ పౌరులున్నారు. ట్విటర్‌ ద్వారా ఇస్లామాబాద్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. "మేం చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ కార్‌ అనుమానాస్పదంగా కనిపించింది. ఆఫీసర్స్‌  ఆ కార్‌ను ఆపిన మరుక్షణమే డ్రైవర్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఓ పోలీస్ మృతి చెందాడు" అని ఇస్లామాబాద్ పోలీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "కార్‌లో ఓ జంట ఉంది. అనుమానం వచ్చి మేం తనిఖీ చేసేందుకు ఆపాం. ముందు ఇద్దరూ కిందకు దిగారు. చెకింగ్  చేస్తుండగా డ్రైవర్ ఏదో కారణం చెప్పి మళ్లీ కార్‌లోకి వెళ్లాడు. అప్పుడే సూసైడ్‌ బాంబుతో తనను తాను పేల్చుకున్నాడు" అని డీజీపీ స్పష్టం చేశారు.